
తల్లి చేతి వంట రుచి, ఊరి వీథుల్లోని మిఠాయిల తియ్యదనం– ఇవన్నీ ఇప్పుడు న్యూయార్క్ వేదికపై ప్రపంచానికి కమ్మగా వడ్డిస్తున్నాయి. ఫుడ్ ప్రపంచంలో ఆస్కార్‌గా పరిగణించే ‘జేమ్స్ బీర్డ్ అవార్డు’ను ఒక భారతీయుడు సొంతం చేసుకొని చరిత్ర సృష్టించాడు. మదురై వీథుల్లో తిరిగిన చిన్నోడు, ఈరోజు న్యూయార్క్ బిలియనీర్ల సరసన నిలిచాడు.
కారణం ఒక్కటే, అతని చేతి వంట! మదురైలోని నాథం గ్రామంలో పుట్టిన విజయ్ ఇంజినీర్ కావాలని కలలు కన్నాడు. కాని, ఫీజులు కట్టలేక వంట స్కూల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. ఇది అతని జీవితానికి మలుపు అయినప్పటికీ, వంట మీద ఉన్న చిన్ననాటి ప్యాషన్ అతన్ని ముందుకు నడిపింది. ‘ప్రతి వంటకం వెనుక ఒక కథ, ఒక కళ ఉంటుంది’ అని నమ్మాడు.
చెన్నైలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో మూడు సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసి, ‘తాజ్ కనెమారా హోటల్’లో మొదటిసారి షెఫ్‌గా మారాడు. తర్వాత అమెరికా ప్రయాణం అతని ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ‘దోసా’, ‘రాసా’లాంటి రెస్టరెంట్లలో పనిచేస్తూ వంటలో మరింత ప్రావీణ్యం సాధించాడు. కాని, ఆ మార్గం అంత సులభం కాలేదు. క్రూజ్ షిప్‌లలో వంట చేస్తూ సముద్రాలను దాటాడు, అమెరికాలో జాతి వివక్ష చేదును కూడా రుచి చూశాడు.
అయినా, అతని మనసు ఎప్పుడూ ఒకటే చెప్పేది ‘వంట చేయి, నీలా చేయి, నిజంగా చేయి.’ అదే సమయానికే రోనీ, చింతన్ అనే ఇద్దరు ఫుడ్ రెబల్స్ అతని కథలోకి వచ్చారు. వారి ప్రోత్సాహంతో విజయ్ తెరిచిన ‘సెమ్మా’ కేవలం ఒక రెస్టరెంట్ మాత్రమే కాదు, అది తమిళ పాకకళకే ప్రపంచ వేదిక అయ్యింది. ఒకప్పుడు ‘ఫస్ట్ ర్యాంక్ తెచ్చి కుక్ అవుతావా?’ అని ఎగతాళి చేసినవాళ్లే ఇప్పుడు అతని రెస్టరెంట్‌లో టేబుల్ బుకింగ్ కోసం ఏటా ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే ట్రఫుల్ ఆయిల్, కేవియర్ తినే వాళ్లు కూడా ఇక్కడ చేతులతో దోసె ముక్కలు సాంబార్‌లో ముంచి తింటూ ఆశ్చర్యపోతున్నారు. మొదట స్పైసీగా అనిపించినా, చివరికి ఆ రుచులే వారిని మళ్లీ మళ్లీ రప్పిస్తున్నాయి. సెమ్మా ప్రారంభమైన ఏడాదికే ‘మిషెలిన్ స్టార్’ దక్కించుకుంది. 2023లో న్యూయార్క్ టైమ్స్ ‘నంబర్ వన్ రెస్టరెంట్’గా గుర్తింపు పొందింది. ఇప్పుడు 2025లో ఫుడ్ ప్రపంచంలో ఆస్కార్‌గా భావించే ‘జేమ్స్ బీర్డ్’ అవార్డు కూడా విజయ్‌కుమార్ సొంతమైంది.
స్టేజ్ మీద నిలబడి అతను అన్న మాటలు మరింత మనసును హత్తుకున్నాయి. ‘నల్ల చర్మం కలిగిన ఒక తమిళుడు ఇంత పెద్ద వేదికపై నిలబడతాడని ఎవరూ అనుకోలేదు. ఇది నా విజయం మాత్రమే కాదు, మా అమ్మ వేసే దోసెది, నా అమ్మమ్మ మట్టి పాత్రలో వండిన చేపల పులుసుదీ, మొత్తం భారతీయ వంటల రుచిదీ.’ అంటూ అవార్డును దేశ వంటల గొప్పతనానికి అంకితం చేశాడు.
కుటుంబం కూడా!
ఈ విజయానికి వెనుక అతని కుటుంబమే అండగా నిలబడి ఉంది. తల్లి, అమ్మమ్మల దగ్గర నేర్చుకున్న వంటల జ్ఞానం, వారి వంటల్లోని బంధమే ఈరోజు విజయ్‌కుమార్‌ని ప్రపంచ వేదికపై నిలబెట్టింది. లగ్జరీ ఇన్‌గ్రీడియంట్స్ కంటే నిజమైన కరివేపాకు వాసన, కొబ్బరి రుచి, మసాలాలే నిజమైన లగ్జరీ అని వాళ్లే నేర్పారు.
(చదవండి: పారాగ్లైడింగ్ చేస్తూ లైవ్ మ్యూజిక్ ప్లే చేసిన మహిళ..!)