సాక్షి చెన్నై: కరూర్‌లో జరిగిన విషాద ఘటనతో తను చేస్తున్న అన్ని ప్రజా కార్యక్రమాలను నిలిపివేసిన సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కొంతకాలం విరామం తర్వాత తిరిగి తన ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు. ప్రచార యాత్ర పునఃప్రారంభానికి సంబంధించి నిర్వహించనున్న తొలి పెద్ద సభ కాంచీపురంలో జరగనుందని టీవీకే పార్టీ వర్గాలు ధృవీకరించాయి. పార్టీ బలోపేతం, స్థానిక నాయకుల సమావేశం, ప్రజలతో మళ్లీ ప్రత్యక్షంగా అనుసంధానమవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. తొలి సభను కాంచీపురంలో నిర్వహించడానికి విజయ్ టీమ్ నిర్ణయం తీసుకుంది. దాంతో కాంచీపురానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో విజయ్ వెంటనే అన్ని ప్రజా ఈవెంట్లను సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబాల పట్ల గౌరవ సూచికగా చేపట్టిన ఈ నిర్ణయాన్ని అప్పట్లో విస్తృతంగా ఆయన అభిమానులు అభినందించారు. ఆ సమయంలో బీజేపీ పార్టీ విజయ్‌కు మద్దతుగా నిలిచింది. అయితే కొంతకాలం విరామం తరువాత విజయ్ తిరిగి ప్రచార యాత్రను ప్రారంభించడంతో తాజా రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.
భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసిన అధికారులు
కరూర్ ఘటనను దృష్టిలో పెట్టుకుని సభా ప్రాంగణంలో అదనపు భద్రతను ఏర్పాటు చేయనున్నారు. జనసంచారం నియంత్రణతో పాటు అత్యవసర సేవలు సిద్ధంగా ఉండేలా స్థానిక అధికారులు, పార్టీ నిర్వాహకులు కలిసి పర్యవేక్షిస్తున్నారు. పోలీసుల అనుమతి తిసుకుని కేవలం రెండువేల మందితో మాత్రమే సభను నిర్వహించాలని టీవీకే పార్టీ వర్గాలు నిర్ణయించాయి.
కాగా కాంచీపురం సభ అనంతరం, తమిళనాడులోని పలు కీలకమైన ప్రాంతాలలో విజయ్ ప్రచార షెడ్యూల్‌ను ఏర్పాటు చేసేందుకు పార్టీ ఇప్పటికే తగిన ప్రణాళికలు రూపొందిస్తోంది.


