 
													మన భారతీయ వంటకాలకు ఫిదా కానివారెవ్వరూ.!. దేశ దేశాలలో ఉన్న వివిధ రుచల యందు భారతీయుల రుచులు వేరయా అనొచ్చు కదూ..మనవాళ్లు టేస్ట్..మాములుగా ఉండదు. ఎందుకంటే మన దక్షిణ భారతదేశ బ్రేక్‌ఫాస్ట్‌లపై మనుసు పారేసుకున్న బ్రిటిష్ చెఫ్..ఎంతలా మన టేస్ట్‌కి దాసోహం అయ్యేడో తెలిస్తే విస్తుపోతారు. మరీ ఆ కథేంటో చకచక చదివేయండి మరి..
భారతీయులు మినపప్పు, బియ్యంతో చేసుకునే దోసెలంటే చెవికోసుకుంటారని చెప్పొచ్చు. చాలామటుకు భారతీయులు దోసెకు ఫ్యాన్సే. అంతలా ఇష్టంగా తినే దోసెకు వైట్ చట్నీగా పిలిచే బ్రిటిష్ చెఫ్ టిమ్ డార్లింగ్ దాసోహమైపోయాడు. ఆ వంటకాన్నే తన జీవనోపాధిగా మార్చుకుని..దోసెల వేయడంలో దిట్ట అనుపించుకుంటున్నాడు.
బ్రిటన్‌కి చెందిన ఈ చెఫ్ బ్రిస్టల్‌లోని భారతీయ కమ్యూనిటీలకు తను రుచులను అందిస్తున్నాడు. మొదట చిన్న కారవాన్‌గా దోసె స్టాల్‌ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత రెస్టారెంట్ పెట్టుకునే రేంజ్‌కి వెళ్లిపోయాడు.
దోసె గురించి ఎలా తెలిసిందంటే..
వైట్ చట్నీగా పిలిచే టిమ్ డార్లింగ్ ఉపాధి కోసం చిన్న చిన్న పనుల చేస్తుండేవాడు. అలా ఉపాధి నిమిత్తమై లండన్‌కి వెళ్లగా..అక్కడ వంట చేయడంపై ఆసక్తి పెరిగింది. అక్కడ దీపక్ అనే భారతీయ చెఫ్‌ని కలిశాడు. అతడు డార్లింగ్‌కి దక్షిణ భారత వంటకాలను పరిచయం చేశాడు. క్రిస్పీ దోసెలు, స్పాంజీలాంటి ఇడ్లీల రుచికి ఫిదా అయిపోయాడు. 
ముఖ్యంగా చింతపండు, కరివేపాకు, కొబ్బరితో చేసిన చెట్నీ అతడి మనసుని కదిలిచింది. అప్పుడే డార్లింగ్‌కి తానే ఏం చేస్తే తన లైఫ్ సెటిల్ అవుతుందో అర్థమైందట. అలా లాక్‌డౌన్ సమయంలో సోమర్‌సెట్ స్ట్రీట్‌లో కారవాన్‌లో దోసెలు వేసి భారతీయ కమ్యూనిటీలకు సర్వ్ చేసేవాడు. అక్కడ ఒక బ్రిటిష్ వ్యక్తి దోసెలు అమ్ముతున్నాడా అని తెలిసి..జనం కిటకిటలాడిపోయారు.
అతడు అచ్చం మన భారతీయ వంటవాళ్లు వేసినట్లుగా అలవోకగా వేస్తున్న తీరు అందర్నీ ఆకర్షించింది. ఎలాంటి అడ్వర్టైస్‌మెంట్ అవసరం లేకుండానే అతడి గురించి క్షణాల్లో అందరికీ తెలిసిపోయింది, వ్యాపారం కూడా బాగా నడచింది. దాంతో నెమ్మదిగా ఫుడ్ వ్యాన్‌గా అప్‌గ్రేడ్ చేశాడు. అతడు అచ్చం ఇండియాలోని హోటల్ మాదిరిగానే కొబ్బరి చెట్నీ, సాంబారు, అల్లం చట్నీ వంటివన్నీ సర్వ్ చేశాడు.
ప్రస్తుతం రెండు రెస్టారెంట్లను నిర్వహిస్తున్నాడు. అంతేకాదండోయ్ డార్లింగ్‌కి మన వంటల్లో ప్రావీణ్యం సంపాదించడానికి దాదాపు 15 ఏళ్లు పట్టిందని చెబుతున్నాడు. తమ మాతృభూమికి దూరంగా వచ్చేశామన్న బాధ, తన రెస్టారెంట్‌కి వస్తే పోతుందని భారతీయులు మెచ్చుకునే రేంజ్‌లో రుచికరంగా అందిస్తాడని పేరుతెచ్చుకున్నాడు డార్లింగ్.
నాణ్యతలో రాజీ పడకుండా అందించి భారతీయుల అభిమానమే కాదు..అక్కడే ఉండే బ్రిటన్ దేశస్తులు కూడా ఈ రుచులను ఆస్వాదిస్తున్నారట. నిజంగా టిమ్ డార్లింగ్ గ్రేట్ కదూ..!. వేరే దేశం వంటకాలను నేర్చుకోవడమే కాదు..దాన్ని జీవనోపాధిగా మార్చుకుని అభివృద్ధి చెందడం అంటే మాటలు కాదు కదా..!.
(చదవండి: అక్కాచెల్లెళ్లు నలుగురికి అరుదైన వ్యాధి..! విస్తుపోయిన వైద్యులు)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
