
పసిడి ధరలకు రూపాయి బలహీనత ఆజ్యం పోసింది. ఫలితంగా శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.2,100 పెరిగి నూతన జీవిత కాల గరిష్టమైన రూ.1,03,670 (పన్నులతో కలిపి)కు చేరింది. ఈ నెల 8న నమోదైన రూ.1,03,420 99.9 శాతం స్వచ్ఛతకు పూర్వపు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిగా ఉంది. డాలర్‌తో రూపాయి బలహీనపడడంతో స్టాకిస్టులు కొనుగోళ్లకు మొగ్గు చూపించినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.
‘‘అంతర్జాతీయంగా సానుకూల ధోరణికి తోడు రూపాయి బలహీనతతో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌ల వల్ల జీడీపీపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు సైతం ధరల పెరుగుదలకు తోడయ్యాయి’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
ఎంసీఎక్స్‌లోనూ అక్టోబర్ కాంట్రాక్టు గోల్డ్ ధర రూ.713 పెరిగి రూ.1,02,813కు చేరుకుంది. మరో వైపు వెండి కిలోకి రూ.1,000 నష్టపోయి రూ.1,19,000 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు 40 డాలర్ల మేర పెరిగి 3,515 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యింది.