
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు నిర్ణయించింది. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ తర్వాత సీబీఐ దర్యాప్తుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీబీఐకి కేసు అప్పగించేందుకు ప్రత్యేక ప్రొసీజర్‌ను తీసుకువచ్చారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకపై ఉన్న నిషేధ ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కాగా, 2022లో సీబీఐ రాకపై అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం జరిగిన ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, జస్టిస్ పీసీ ఘోస్ విచారణ కమిషన్ నివేదిక’పై జరిగిన సుమారు తొమ్మిదిన్నర గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆదివారం అర్ధరాత్రి 1:40 గంటల వరకు సాగిన శాసనసభ చర్చలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో అంతర్‌రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్‌లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున సీబీఐకి విచారణ అప్పగించడం సముచితమని తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు.