
ఒక్కసారి ఊహించండి! సాలీడు అల్లిన గూడు తెల్లగా కాకుండా ఎర్రగా మెరిసిపోతే ఎలా ఉంటుందో? అద్భుతంగా ఉంటుంది కదా! ఆ ఊహనే ఇప్పుడు జర్మనీ బైరోయిత్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిజం చేశారు. వెంటనే సాలెగూడు మీద ఎరుపు రంగు పూశారు అనుకుంటే పొరపాటే! ‘క్రిస్పర్’ అనే ప్రత్యేక పద్ధతి ద్వారా వారు సాలెగూడు గుడ్లలో ఒక కొత్త ప్రొటీన్‌ను ప్రవేశపెట్టారు.
ఫలితంగా పుట్టిన చిన్న సాలీళ్లు తమ తంతులను ఎర్రరంగులో అల్లడం మొదలుపెట్టాయి. ఇలా సహజంగా వచ్చే సాలె తంతులు ఇప్పుడు మనిషి ఆలోచనలతో కలిసిన ఒక అద్భుతంగా మారింది. ఇది కేవలం రంగుల వరకే పరిమితం కాదు, ఈ తంతులను మనిషి అవసరాలకు తగ్గట్టుగా మలచుకోవచ్చు.
బలంగా కావాలంటే బలంగా, మృదువుగా కావాలంటే మృదువుగా కొత్త అవసరాలకు అనుగుణంగా ఎలాగైనా మలచుకునే వీలు ఉంది. భవిష్యత్తులో డాక్టర్లకు శరీరంలో కరిగిపోయే కుట్లకూ, డిజైనర్లకు కొత్త బట్టల మేళవింపుకూ, ఇంకా ఎన్నో రంగాల్లో వినియోగించుకునేందుకు ఈ సాలెగూడు తంతులే ప్రధాన ఆధారంగా మారనున్నాయి. ప్రస్తుతం ఇది పరిశోధన దశలో ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలను తీసుకురాగలదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
(చదవండి: రాతిపై చెక్కిన అద్భుతం..!)