breaking news
Fluorescent lamps
-
రంగురంగుల సాలెగూడు!
ఒక్కసారి ఊహించండి! సాలీడు అల్లిన గూడు తెల్లగా కాకుండా ఎర్రగా మెరిసిపోతే ఎలా ఉంటుందో? అద్భుతంగా ఉంటుంది కదా! ఆ ఊహనే ఇప్పుడు జర్మనీ బైరోయిత్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిజం చేశారు. వెంటనే సాలెగూడు మీద ఎరుపు రంగు పూశారు అనుకుంటే పొరపాటే! ‘క్రిస్పర్’ అనే ప్రత్యేక పద్ధతి ద్వారా వారు సాలెగూడు గుడ్లలో ఒక కొత్త ప్రొటీన్‌ను ప్రవేశపెట్టారు. ఫలితంగా పుట్టిన చిన్న సాలీళ్లు తమ తంతులను ఎర్రరంగులో అల్లడం మొదలుపెట్టాయి. ఇలా సహజంగా వచ్చే సాలె తంతులు ఇప్పుడు మనిషి ఆలోచనలతో కలిసిన ఒక అద్భుతంగా మారింది. ఇది కేవలం రంగుల వరకే పరిమితం కాదు, ఈ తంతులను మనిషి అవసరాలకు తగ్గట్టుగా మలచుకోవచ్చు. బలంగా కావాలంటే బలంగా, మృదువుగా కావాలంటే మృదువుగా కొత్త అవసరాలకు అనుగుణంగా ఎలాగైనా మలచుకునే వీలు ఉంది. భవిష్యత్తులో డాక్టర్లకు శరీరంలో కరిగిపోయే కుట్లకూ, డిజైనర్లకు కొత్త బట్టల మేళవింపుకూ, ఇంకా ఎన్నో రంగాల్లో వినియోగించుకునేందుకు ఈ సాలెగూడు తంతులే ప్రధాన ఆధారంగా మారనున్నాయి. ప్రస్తుతం ఇది పరిశోధన దశలో ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలను తీసుకురాగలదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.(చదవండి: రాతిపై చెక్కిన అద్భుతం..!) -
పొదుపే పవర్
కవర్ స్టోరీ ఒక రూపాయిని ఆదా చేయడం అంటే.. ఒక రూపాయిని సంపాదించినట్టే... అన్నది యూరోపియన్ సామెత. అంటే దుబారాను తగ్గిస్తే సంపాదనను పెంచుకొన్నట్టే. వనరుల విషయంలోనైనా ఇంతే. వినియోగంలో వృథాని అరికడితే ఉత్పత్తిని సాధించినట్టే. శక్తి వనరులను సృష్టించడానికి ప్రత్యక్షంగా, సృష్టించిన ఆ వనరులను వృథా చేస్తూ పరోక్షంగా మానవుడు ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నాడు. అలా వృథా అవుతున్న వాటిల్లో ముఖ్యమైనది విద్యుత్. ఈ వృథాలో నిస్సందేహంగా అందరూ భాగస్వాములే! ఈ వృథాలో ఎవరెలా భాగస్వాములవుతున్నారో చూద్దాం... ఇంట్లో బల్బులు... ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ దీపాల ద్వారా పవర్ సేవింగ్ అంటే లైట్లన్నీ ఆఫ్‌చేసి చీకటిలో ఉండిపోనక్కర్లేదు! చిన్న చిన్న మార్పులే మీ చేత పవర్ సేవింగ్ చేయించడంతో పాటు, మీ డబ్బుని కూడా సేవ్ చేస్తాయి. ఉదాహరణకు మనం వాడుతున్న మామూలు బల్బులకు భిన్నంగా కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులను ఉపయోగిస్తే దాదాపు 70శాతం ఎనర్జీని సేవ్ చేసినట్టే! ఫిలమెంట్‌ను వేడిచేయడం ద్వారా వెలుగులు ఇచ్చే సాధారణ 40, 60, 100 వాట్ల ఇన్‌క్యాండిసెంట్ బల్బుల ధర అందరికీ అందుబాటులో ఉండటం వల్ల వాటినే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ అవి ఉపయోగించుకునే విద్యుత్‌లో 90 శాతం వరకూ వేడిరూపంలో వృథా అవుతుంది. 10 శాతం విద్యుత్ మాత్రమే కాంతిగా మారుతుంది. ఇవి చవకే అయినా... విద్యుత్ ఖర్చు మాత్రం అధికం. వీటికన్నా ఫ్లోరోసెంట్ ల్యాంప్స్(ట్యూబ్‌లైట్లు) కొంత మెరుగు. బల్బులతో పోలిస్తే ఇవి అంతే విద్యుత్‌ను ఉపయోగించుకుని 50-70శాతం ఎక్కువ కాంతిని ఇస్తాయి. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్(సీఎఫ్ఎల్స్) 70శాతం విద్యుత్ పొదుపు చేస్తాయి. ఐదు మామూలు బల్బుల స్థానంలో ఐదు సీఎఫ్ఎల్ బల్బులను అమర్చుకుంటే ఏడాదికి కరెంటు బిల్లులో రెండువేల ఐదొందలు తగ్గుతుంది. అయితే ప్రస్తుతం అన్నింటికన్నా ఎక్కువ పొదుపునిచ్చేవి ఎల్ఈడీ లైట్లే. సీఎప్ఎల్స్ కన్నా ఇవి 50శాతం తక్కువ విద్యుత్‌ను వాడుకుంటాయి. వీటి జీవితకాలం కూడా 10-25 ఏళ్లు ఉంటుంది. ట్యూబ్‌లైట్లు, సీఎఫ్ఎల్స్ కొంతకాలానికి డిమ్ అవుతాయి. కానీ ఎల్ఈడీలు చివరిదాకా ఒకేలా పనిచేస్తాయి. వీటిపై పెట్టే అదనపు ఖర్చు రెండేళ్లలోనే పొదుపు రూపంలో తిరిగి దక్కుతుంది. ⇒ బల్బుపై పేరుకొన్న దుమ్ము వెలుగును తగ్గించేస్తుంది. కాబట్టి బల్బ్‌ను తుడవాలి. ⇒ పగలు కర్టెన్లు తెరిచి సూర్యకాంతిని ఇంట్లోకి రానివ్వాలి. ⇒ టీవీ చూడనప్పుడు విద్యుత్ సరఫరా అయ్యే స్విచ్ని కూడా ఆఫ్ చేయాలి. రిఫ్రిజిరేటర్ 15 ఏళ్లు దాటితే... ఇప్పుడు ఎక్కువ కంపెనీలు తక్కువ విద్యుత్‌తో నడిచే రిఫ్రిజిరేటర్లను డిజైన్ చేస్తున్నాయి. అలాంటి ఫ్రిజ్ కొనడం సరే, దాని వాడకంలో కూడా విద్యుత్‌ను పొదుపు చేయవచ్చు. ఫ్రిజ్ ను మూడు నుంచి నాలుగు సెంటీగ్రేడ్ డిగ్రీల వద్ద ఉంచడం, ఫ్రీజర్లను మైనస్ 15 నుంచి మైనస్ 18 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్యలో ఉంచడం మంచిది. ఫ్రిజ్ డోర్ తెరిచిన ప్రతి సారీ దాదాపు 30 శాతం చల్లదనం తగ్గిపోయి ఆ స్థానంలోకి వేడిమి ప్రవేశిస్తుంది. కాబట్టి చీటికిమాటికీ కాకుండా అవసరమైనప్పుడు మాత్రమే తెరవాలి. 15 ఏళ్లు దాటిన రిఫ్రిజిరేటర్ పని చేస్తున్నా సరే మార్చడమే మంచిది. ఒక సాధారణ కుటుంబం వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని పరిగణిస్తే కొత్త రిఫ్రిజిరేటర్ ఏడాదికి రెండున్నర వేల రూపాయల విలువైన విద్యుత్‌ని తీసుకుంటే పాత రిఫ్రిజిరేటర్ కరెంటు వినియోగం ఐదు వేల వరకు ఉంటుంది. అధునాతనమైన మోడళ్లలో ఒక లైట్ బల్బ్ కన్నా తక్కువ శక్తితో నడిచేవి ఫ్రిజ్లున్నాయి. ఏసీలు ఒక డిగ్రీ పెంచితే... ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న ఏసీల కరెంటు ఖర్చు సగటున 30-50శాతం యూనిట్లు తగ్గుతుంది. గది సైజును బట్టి ఏసీ కెపాసిటీని ఎంచుకోవాలి. అలాగే ఏసీని సరైన చోట అమర్చడమూ ముఖ్యమే. ఎండ పడనిచోట, గాలి ఆడేచోట అమర్చడం ఉత్తమం. ఏసీని అమర్చే చోటు ఫిల్టర్లు తీసి క్లీన్ చేయడానికీ, మరమ్మతు చేయడానికీ వీలుగా ఉండాలి. దుమ్ముపట్టిన ఏసీల ఫిల్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ముఖ్యంగా వేసవికి ముందు క్లీన్ చేయించాలి. అప్పుడే ఏసీల్లోకి గాలి సులభంగా ప్రవేశించి కరెంటు ఖర్చు తగ్గుతుంది. కండెన్సర్‌ను శుభ్రంగా ఉంచడం వల్ల కూడా పనితీరు మెరుగవుతుంది. గదిలో వేడిని విడుదల చేసే లైట్లు, కంప్యూటర్లు, టీవీల వంటివాటిని ఉపయోగించనప్పుడు ఆపేయాలి. ఇవి దగ్గరగా ఉంటే ఏసీ థర్మోస్టాట్ల పనితీరూ ప్రభావితం అవుతుంది. ఏసీలను ఎప్పుడూ 24-25 డిగ్రీ సెంటీగ్రేడ్ల వద్ద ఉంచితే విద్యుత్ ఆదాకు కలిసివస్తుంది. ఒక డిగ్రీ పెంచిన కొద్దీ ఏసీ ఉపయోగించుకునే విద్యుత్ వినియోగం సగటున 3-5 శాతం తగ్గుతుంది. ఫ్యాన్లతో బిల్లు గిరగిరా... సాధారణ సీలింగ్ ఫ్యాన్లు సుమారుగా సెకనుకు 1 స్పీడు మీద ఉంటే 14 వాట్లు, 2 మీద ఉంటే 26 వాట్లు, 3 మీద 39 వాట్లు, 4 మీదైతే 48 వాట్లు, 5 మీద 76 వాట్ల శక్తిని వినియోగించుకుంటాయి. అందువల్ల ఫ్యాన్ ఎంత స్పీడు అవసరమో అంత పెట్టుకుంటేనే విద్యుత్‌ను పొదుపు చేయగలం. అలాగే ఫ్యాను పాతబడిన కొద్దీ విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఇక టేబుల్ ఫ్యాన్లు అయితే... కనీస వేగంతో న డిస్తే సుమారుగా 50 వాట్లు, గరిష్ట వేగంగా తిరిగితే 55 వాట్లు వినియోగించుకుంటాయి. సాధారణ సీలింగ్ ఫ్యాన్లు 70-85 వాట్లువినియోగించుకుంటాయి. కానీ 5 స్టార్ రేటింగ్ ఫ్యాన్లు 45-55 వాట్లతో, సూపర్ ఎఫీషియెంట్ సీలింగ్ ఫ్యాన్లు 30-33 వాట్లతోనే నడుస్తాయి. అలాగే గది సైజును బట్టి ఫ్యాన్ సైజును ఎంచుకోవాలి. పాత రకం రెగ్యులేటర్లకు బదులుగా గుండ్రటి, స్మూత్ స్టెప్ టైప్ స్విచ్ ఉండే రెగ్యులేటర్ వాడితే ఫ్యాన్‌కు ఖర్చయ్యే విద్యుత్‌లో 30 శాతం ఆదా అయినట్లే. వీలైనంత వరకూ తలుపులు, కిటికీలు తెరిచి సహజంగా గాలి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవడం ఉత్తమం. కూలర్లు... కూలర్లు కూల్‌గా బిల్లును పెంచేస్తాయి. వీటిలో ఫ్యాన్, మోటారు ఉంటాయి. కాబట్టి విద్యుత్ ఎక్కువ అవసరం. సైజు, తయారీ రకాలను బట్టి వివిధ కూలర్లు సుమారుగా... 100-500 వాట్లతో పనిచేస్తాయి. ఐరన్ బాక్స్... ఐరన్ బాక్సులు సుమారుగా 1000-1800 వాట్ల సామర్థ్యంతో పనిచేస్తాయి. ఆటోమేటిక్ టెంపరేచర్ కట్ఆఫ్ ఆప్షన్ ఉండే ఐరన్బాక్సులనే ఎంచుకోవాలి. వీటివల్ల సరైన ఉష్ణోగ్రత వద్దకు వేడికాగానే విద్యుత్ వినియోగం ఆగిపోతుంది. అలాగే ఇస్త్రీ చేసేటప్పుడు దుస్తులపై నీళ్లు ఎక్కువగా చల్లకూడదు. దుస్తులు తడిగా ఉన్నప్పుడు (ఆరకముందే) ఐరన్ చేయకూడదు. తడి బట్టల వల్ల ఐరన్‌బాక్స్ వేడి త్వరగా కోల్పోతుంది. కాబట్టి అది వేడెక్కేందుకు కరెంటూ ఎక్కువగా అవసరమవుతుంది. ఐరన్బాక్స్ను ఆన్‌చేసి వేరే పనిలోకి వెళ్లినా కరెంటు వేస్ట్ అయినట్లే. గీజర్ల విషయంలో.. నీరు వేడెక్కిన వెంటనే గీజర్ కరెంటు తీసుకోవడం ఆపేస్తుంది. ఆ నీటిని వాడక పోతే కొద్దిసేపటికి చల్లారిపోయి, మళ్లీ వేడికావడానికి గీజర్ ఆటోమేటిగ్గా ఆన్ అవుతుంది. ఈ క్రమంలో కరెంటు వినియోగం రెట్టింపవుతుంటుంది కూడా. అలాగే వేడి నీటి కుళాయిల నుంచి సెకనుకు ఒక్క చుక్క లీక్ అవుతుంటే... నెలకు 165 గ్యాలన్లు వృథా అయినట్లే. ఇవి ఒక మనిషి రెండు వారాల పాటు రోజూ స్నానానికి వాడే నీరన్నమాట. కాబట్టి ట్యాప్‌లు, పైపుల్లో లీకేజిని నివారించడం అంటే నీటి వృథాను అరికట్టడం ఒక్కటే కాదు, ఆ మేరకు విద్యుత్తు వృథాని కూడా నివారించినట్లే. డిష్వాషర్... ఫ్రిజ్‌లు, టీవీలు, వాషింగ్మిషన్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వినియోగంలోకి వచ్చేశాయి కానీ ఈ డిష్ వాషర్లు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. వీటి వల్ల ఉపయోగాలు ఎక్కువగానే ఉన్నాయి. ఉదాహరణకు సింక్‌లో గిన్నెలను కడగడానికి ఖర్చయ్యే నీటితో పోలిస్తే డిష్ వాషర్లో నీటి ఖర్చు మూడోవంతు మాత్రమే. అయితే ఇవి కరెంటును మాత్రం పీల్చేస్తాయి. కాబట్టి డిష్ వాషర్ల ఎంపికలో స్టార్ రేటింగ్‌ను పరిశీలించుకోవాలి. లోడ్ ఫుల్‌గా ఉన్నప్పుడు మాత్రమే రన్చేయాలి. తక్కువ టెంపరేచర్‌తో తక్కువ రన్నింగ్ టైమ్ ను పెడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. డెస్క్టాపా... ల్యాప్టాపా! డెస్క్‌టాప్ తీసుకునే విద్యుత్‌లో నాలుగోవంతు విద్యుత్‌తోనే ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. ఒక డెస్క్‌టాప్ సగటున 80 వాట్ల విద్యుత్‌ను ఉపయోగిస్తుంది. ల్యాప్‌టాప్ 20 వాట్స్తోనే నడుస్తుంది. సోని ప్లేస్టేషన్ 200 వాట్ల విద్యుత్‌ను ఉపయోగిస్తుంది. ముఖ్యంగా గమనించవలసినది ఏమిటంటే... ఇవి ఐడల్ స్టేట్‌లోనే ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి! ఉదాహరణకు కంప్యూటర్ వాడుతున్నప్పుడు ఎంత పవర్ ఖర్చు అవుతుంటుందో... సీపీయూ, మానిటర్లు ఆన్‌చేసి వాడకుండా అలాగే ఉంచినప్పుడు కూడా అంతే పవర్ ఖర్చు అవుతూ ఉంటుంది. స్క్రీన్‌సేవర్ సెట్‌చేసి ఉంటే... వాడుతున్నప్పటి కంటే ఖాళీగా ఉన్నప్పుడే ఎక్కువ విద్యుత్‌ను తీసుకుంటాయి. ‘ఇప్పుడే వస్తాను కదా’ అని కంప్యూటర్ని ఆన్‌లో ఉంచకుండా పది నిమిషాల సేపు దూరంగా వెళ్తున్నా సరే టర్న్ ఆఫ్ చేయాలి. వాషింగ్ మెషీన్ నిండుగా... వాషింగ్ మెషీన్లో లోడ్ఫుల్గా ఉంటేనే మంచిది. బట్టలు మెషీన్ నిండుగా వేసి ఉతికినా... తక్కువగా వేసినా మెషీన్ తీసుకునే పవర్ ఒకే స్థాయిలో ఉంటుంది. ఒకవేళ తక్కువ లోడ్‌తో బట్టలు ఉతకాల్సి వస్తే మెషీన్లో వాటర్ లెవల్‌ను అందుకు తగ్గట్టుగా సెట్ చేయాలి. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న వాషింగ్ మెషీన్లలో ఫ్రంట్ లోడ్ మెషీన్లు ఉత్తమమైనవి. ఇవి టాప్ లోడెడ్ వాషింగ్ మిషన్ల కన్నా 15 శాతం తక్కువ విద్యుత్‌ను ఉపయోగిస్తాయి! ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎనర్జీ ఎఫిషియెంట్ వాషింగ్ మిషన్లు ఎంత నీటిని పొదుపు చేస్తాయంటే... ఒక మనిషి ఏడాది కాలంలో తాగేటంత నీటి ఆదా చేస్తాయి. ఇంటర్నెట్తో రెండు వైపులా ఖర్చే! ప్రస్తుతం ప్రపంచ విద్యుత్ వినియోగంలో గూగుల్ సెర్చ్ కోసం, గూగుల్ అకౌంట్ల నిర్వహణ కోసం నెటిజన్లు వినియోగిస్తున్న విద్యుత్ 0.0013 శాతం! దీంతోనే ఏకంగా రెండు లక్షల ఇళ్లకు కనీస అవసరాలకు విద్యుత్‌ను సరఫరా చేయవచ్చు. గూగుల్‌లో వంద సెర్చ్‌లు చేయడానికి ఖర్చు అయ్యే విద్యుచ్ఛక్తి ఒక 60 వాట్ బల్బ్ 28 నిమిషాల పాటు వెలిగేందుకు అయ్యే ఖర్చుతో సమానం. ఒక క్వెరీకి ఆన్సర్ చేయడానికి గూగుల్ 0.0003 కిలోవాట్ విద్యుత్‌ను ఉపయోగిస్తుంది. ఓవెన్ తెరుస్తూ ఉంటే... ఓవెన్‌పై వండేటప్పుడు తరచూ దాని డోర్ తెరవడం మంచిది కాదు. దీని వల్ల 15 శాతం వరకూ వేడి తగ్గిపోతుంది. అలాగే ఓవెన్ నుంచి వేడిమి బయటకు వచ్చేస్తోందేమో పరిశీలించాలి. అలాగే కాయగూరలు, పప్పులు వంటివి ఉడికించేప్పుడు అనవసరంగా ఎక్కువ నీళ్లు పోయకూడదు. టెలివిజన్ తెర పెద్దదయ్యే కొద్దీ... టీవీ తెర పెద్దదయ్యేకొద్దీ విద్యుత్ వినియోగమూ పెరుగుతుంది. 32 అంగుళాల టీవీ నడిచే విద్యుత్‌తో పోలిస్తే 50 అంగుళాల టీవీ రెట్టింపు కరెంటును వినియోగిస్తుంది. అలాగే మామూలు టీవీ కంటే అదే సైజు ప్లాస్మా టీవీ రెండింతలు ఎక్కువ విద్యుత్ తీసుకుంటుంది. స్టార్ రేటింగ్ ను ఎంచుకోవాలి! ఇంట్లో ఉపయోగించే ప్రధానమైన ఎలక్ట్రానిక్ వస్తువులు అయిన టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్మిషన్లకు, డిష్ వాషర్లకు స్టార్ రేటింగ్ ఉంటుంది. విద్యుత్ వినియోగంలో పొదుపు ఆధారంగా వీటికి ఈ రేటింగ్ ఇస్తారు. ఎక్కువ స్టార్లు కలిగి ఉన్న ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ విద్యుత్‌ను వినియోగించుకొంటాయి. ఎక్కువ స్టార్లు ఉన్న వస్తువుల ధర ఎక్కువగానే ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో విద్యుత్ పొదుపుతో అవి ఉత్తమమైనవి అవుతాయి. - యెద్దుల హన్మిరెడ్డి, బి. జీవన్‌రెడ్డి