
ఆక్సిజన్ పార్కు పూర్తయ్యేనా?
మడికొండ: గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ రాంపూర్–స్టేషన్‌పెండ్యాలలో నిర్మించతలపెట్టిన ఆక్సిజన్ పార్కు అటకెక్కింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2017లో రూ.నాలుగు కోట్లతో పార్కు నిర్మాణానికి కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులు శ్రీకారం చుట్టారు. 99 ఎకరాల్లో 40 ఎకరాలు ఉన్న ఊర చెరువును అభివృద్ధి చేయడంతోపాటు మిగిలిన స్థలంలో మియావాకీ, బ్లాక్ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. పార్కు ఎంట్రెన్స్‌లో గేట్‌వే నిర్మాణంతో పాటు చిల్డ్రన్స్ పార్కు, ఓపెన్ జిమ్, బట్టర్ ఫ్‌లై పార్కు నిర్మాణం చేయనున్నట్లు అప్పుడు అధికారులు తెలిపారు. చెరువులో బోటింగ్, ఫిషింగ్, యాక్టివిటీ, పాత్ వే నిర్మాణం, ఫుడ్‌కోర్టు, వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు 20 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
ఆక్సిజన్ పార్కులో మియావాకి
ఫారెస్ట్ ప్రత్యేకత..
తక్కువ స్థలంలో ఎక్కువగా మొక్కలను పెంచడమే మియావాకీ ప్రత్యేకత. మియావాకీ రాష్ట్రంలోనే తొలిసారి ఇక్కడ ఏర్పాటుచేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. పెరుగుతున్న జనాభాకు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేయడమే ఈ పార్కు ముఖ్య ఉద్దేశం. అరమీటరుకు ఒకటి చొప్పున నాటిన మొక్కలు పెరిగే కొద్ది దట్టమైన అడవిలా మారుతుందని, దీని మధ్యలో ఉండే పాత్‌వేలో నడుచుకుంటూ వెళ్తే అడవిలో నుంచి వెళ్తున్న అనుభూతి కలిగే విధంగా తీర్చిదిద్దనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ, ఆక్సిజన్ పార్కులో అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో పర్యాటకులు, నగర ప్రజలకు ఆహ్లాదం కరువైంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి పార్కు పనులు పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
2017లో రూ.4 కోట్లతో కుడా శంకుస్థాపన
99 ఎకరాల్లో ఏర్పాటుకు
అధికారుల ప్రణాళిక
ఇప్పటివరకు 20 శాతం కూడా
పూర్తికాని పనులు

ఆక్సిజన్ పార్కు పూర్తయ్యేనా?