
వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు
చెరువులను పరిశీలించిన మేయర్, కమిషనర్
వరంగల్ అర్బన్ : నగరంలో వినాయక నిమజ్జనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. శనివారం వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో నిమజ్జనం జరిగే ఉర్సు రంగసముద్రం, బెస్తం చెరువులను కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అధికారులతో కలిసి ఆమె సందర్శించారు. మేయర్ మాట్లాడుతూ.. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా బల్దియా తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రాష్ కలెక్టర్ యంత్రం ద్వారా చెరువుల్లో కొనసాగుతున్న పూడికతీత, గురప్రు డెక్క తొలగింపు పనులు పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్ శాఖతో సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. బల్దియా ద్వారా రహదారులపై గ్రావెల్, తగినంత లైటింగ్, శానిటేషన్‌లో భాగంగా ఎప్పటికప్పుడు నిమజ్జన పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మరుపల్లి రవి, గుండు చందన, అరుణ, మానస రాంప్రసాద్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, రాజేశ్, ఇంజనీర్లు పాల్గొన్నారు.
రోడ్ల మరమ్మతులు చేపట్టండి
వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులకు త్వరగా మరమ్మతులు చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో మేయర్ సమావేశమై వర్షాకాలం సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిల్వ ఉండకుండా మొరం పోసి సమాంతరం చేయాలన్నారు. మంచినీరు కలుషితం కాకుండా ఫిల్టర్ బెడ్ల వద్ద నిత్యం పరవేక్షిస్తూ అవసరమైన చోట వాల్వ్‌లు మార్చాలని పేర్కొన్నారు.
కోటలో పర్యటన..
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఖిలావరంగల్ మధ్యకోటలోని తూర్పు, పడమర, పశ్చిమ, ఉత్తర కోటలను శనివారం ‘కుడా’ అధికారులతో కలిసి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గుండు చెరువు సుందరీకరణ, అడ్వెంచర్ స్పోర్ట్స్, వాకింగ్ ట్రాక్, ఫుడ్ కోర్ట్ పనులను పరిశీలించారు. కోట చుట్టూ మోట్ జీవ పునరుద్ధరణ (బయో డైవర్సిటీ) పనులు త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని ‘కుడా’ అధికారులను ఆదేశించారు.