
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: వృద్ధులు, దివ్యాంగుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ హాల్‌లో దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివ్యాంగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. దివ్యాంగుల దరఖాస్తులపై నిర్లక్ష్యం వహించొద్దని, తక్షణమే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా సంక్షేమాధికారి రాజమణి, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, అధికారులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యసేవలందించాలి
జిల్లాలోని ప్రభుత్వం ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. శనివారం కలెక్టరేట్ చాంబర్‌లో ఏరియా ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లు, ఆర్‌ఎంఓలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఉత్తమ సేవలందించాలన్నారు. అధికారులు సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సమీక్షలో డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్ కిశోర్, వైద్యులు మురళి తదితరులు పాల్గొన్నారు.