ఉమ్మడి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచిన నాగర్‌కర్నూల్
కల్వకుర్తి టౌన్: కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ (పీజీఐ–డీ ) 2025–26 నివేదికలో ఉమ్మడి పాలమూరులో నాగర్‌కర్నూల్ జిల్లా మరోసారి ప్రత్యేకత చాటుకుంది. పాఠశాల విద్యా ప్రమాణాలను 6 కీలక అంశాలపై విశ్లేషించి రూపొందించిన నివేదికలో మొత్తం 600 మార్కులకు గాను 333 మార్కులు సాధించి.. ప్రచేష్ట–1 గ్రేడ్ దక్కించుకుంది. అలాగే ఉమ్మడి జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలు బార్డర్ మార్కులతో ప్రచేష్ట–1లో నిలవగా.. మహబూబ్‌నగర్ మాత్రం ప్రచేష్ట–2కే పరిమితమైంది.
ఒకే విధమైన ప్రమాణాలతో..
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను ఒకే విధమైన ప్రమాణాలతో అంచనా వేయడానికి కేంద్ర విద్యాశాఖ పర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ (పీజీఐ–డీ)ను ప్రవేశపెట్టింది. జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడంతోపాటు ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి వాటిని సరిదిద్దేందుకు ఈ సూచికను రూపొందించారు. ప్రతి జిల్లాకు 600 మార్కుల స్కోరు కేటాయించి వివిధ ప్రమాణాల ఆధారంగా గ్రేడింగ్ ఇస్తారు.
ఆరు అంశాలే కీలకం..
జిల్లాల పనితీరులో అభ్యసన ఫలితాలు, తరగతి గది బోధన, మౌలిక వసతులు– విద్యార్థుల హక్కులు, పాఠశాల భద్రత– విద్యార్థుల సంక్షేమం, డిజిటల్ లెర్నింగ్, పాలన– నిర్వహణ అనే ఆరు ప్రధాన విభాగాల్లో పరిశీలిస్తారు. ప్రతి విభాగానికి నిర్దిష్ట సూచికలు ఉండగా.. వాటి ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.
అధికారిక గణాంకాలే..
పాఠశాల విద్యకు సంబంధించిన సమాచారం జిల్లా, రాష్ట్రస్థాయిల్లోని యూడైస్ ప్లస్, ఎన్‌ఏఎస్, పీఎం పోషణ్, సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ తదితర అధికారిక డేటాబేస్‌ల నుంచి సేకరిస్తారు. రాష్ట్రాలు నివేదించిన అధికారిక సమాచారాన్ని కేంద్ర విద్యాశాఖ పరిశీలించి తుది స్కోర్లు ప్రకటిస్తుంది. అందువల్ల ఈ గ్రేడింగ్ పూర్తిగా ప్రభుత్వ అధికారిక గణాంకాల ఆధారంగానే ఉంటుంది.
ప్రమాణాల మెరుగుకు..
ఈ సూచిక ద్వారా ఏ జిల్లా ఏ రంగంలో వెనకబడి ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు ఒక జిల్లాకు అభ్యసన ఫలితాల్లో మంచి మార్కులు వచ్చినా, డిజిటల్ లెర్నింగ్ లేదా మౌలిక వసతుల్లో తక్కువ స్కోరు వస్తే.. ఆయా రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. అలాగే జిల్లాల మధ్య పోటీ పెరిగి విద్యా ప్రమాణాలు మెరుగుపడటానికి ఇది దోహదపడుతుంది. కేంద్ర ప్రభుత్వం వెలువరించిన నివేదికలో నాగర్‌కర్నూల్ ఉమ్మడి పాలమూరులో అగ్రస్థానంలో నిలిచినప్పటికీ.. డిజిటల్ లెర్నింగ్, పాఠశాల భద్రత, మౌలిక వసతుల విభాగాల్లో స్కోరు పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తే ‘ప్రచేష్ట–1’ నుంచి ‘ఉత్తమ్’ గ్రేడ్ సాధించే అవకాశం ఉంది.
బార్డర్ మార్కులతో ‘ప్రచేష్ట–1’ గ్రేడ్ సాధించిన నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలు
‘ప్రచేష్ట–2’కే పరిమితమైన మహబూబ్‌నగర్
బోధన, అభ్యసన ఫలితాలు,
పాలనలో మెరుగైన పనితీరు
మౌలిక వసతులు, డిజిటల్ లెర్నింగ్‌లో మెరుగుదల అవసరం


