‘సమగ్ర వ్యవసాయ పథకం’ వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘సమగ్ర వ్యవసాయ పథకం’ వినియోగించుకోవాలి

Jul 15 2026 1:22 AM | Updated on Jul 15 2026 1:22 AM

ఖిల్ల్ఘానపురం: కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అమలు చేస్తున్న వాతావరణ ఆధారిత సమగ్ర వ్యవసాయ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు కోరారు. మంగళవారం మండలంలోని పర్వతాపురం రైతువేదికలో పథకంపై అవగాహన, అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2015 నుంచి 2022 వరకు ఖిల్లాఘనపురం మండలంలోని పర్వతాపురం, ఆగారం, అంతాయపల్లి, వెంకటాంపల్లి, అల్లమాయపల్లి వాతావరణ ఆధారిత సమగ్ర వ్యవసాయ పథకానికి ఎంపికయ్యాయన్నారు. ఈ పథకంలో అప్పట్లో రైతులకు ఒక్కో యూనిట్‌కు రూ.91 వేల విలువ చేసే గేదెలు, స్ప్రింక్లర్‌ పైపులు, కోడిపిల్లలు, మొక్కలు అందించామన్నారు. ఆ పథకంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.27 కోట్లు మంజూరయ్యాయని.. గతంలో మాదిరిగా రైతులకు యూనిట్లు అందిస్తామని చెప్పారు. పథకాన్ని ఎలా కొనసాగించాలనే విషయంపై రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, రైతులు పాల్గొన్నారు.

ఘనంగా ఆరుద్ర పూజలు

కొత్తకోట రూరల్‌: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న దత్తకోటిలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని వరుణ సహిత రుద్రహోమం చేసి పూర్ణాహుతి సమర్పించారు. పూజా కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అన్న ప్రసాద విచారణ చేపట్టారు.

స్థల పరిశీలన

వనపర్తి రూరల్‌: పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి సమీపంలో ఉన్న పల్లెగుట్టపై అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటుకుగాను మంగళవారం తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ కో–ఆర్డినేటర్‌ నవత స్థల పరిశీలన చేపట్టారు. అక్కడి సౌకర్యాలు, నేల రకం పరిశీలించి సానుకూలంగా స్పందించారని స్థానిక నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడంతో గతంలోనూ ఈ ప్రాంతాన్ని అధికారులు రెండుసార్లు పరిశీలించారు. వారి వెంట స్థానిక నాయకులు లక్ష్మణ్‌ నాయుడు, బాలకృష్ణ నాయుడు, బాలరాజుశెట్టి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement