నేడు ఉమ్మడి పాలమూరుకు సీఎం | - | Sakshi
Sakshi News home page

నేడు ఉమ్మడి పాలమూరుకు సీఎం

Jul 15 2026 1:22 AM | Updated on Jul 15 2026 1:22 AM

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. మొదట పాలమూరు సమీపంలోని దివిటిపల్లిలో ఉన్న అమరరాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌లో కొత్తగా నిర్మించిన కస్టమర్‌ క్వాలిఫికేషన్‌ ప్లాంట్‌ను, అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్మించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను మహబూబ్‌నగర్‌, వనపర్తి కలెక్టర్లు ఖుష్బూగుప్తా, ఆదర్శ్‌ సురభి వేర్వేరుగా వెల్లడించారు. సీఎం పర్యటించనున్న ప్రదేశాలను మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. హెలిప్యాడ్‌, భద్రత ఏర్పాట్లు, సభా ప్రాంగణంలో వేదిక (డయాస్‌), సీటింగ్‌, రాకపోకలు, ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా అధికారులు, కంపెనీ ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి వనపర్తి కలెక్టర్‌, ఎస్పీలతో కలిసి సీఎం ప్రారంభించనున్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌, వనపర్తి ఎస్పీ డి.జానకి, సునీతారెడ్డి, వనపర్తి అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్‌, వినోద్‌కుమార్‌, సీఎం సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌ శ్రీధర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ (అండర్‌ ట్రైనీ) సాయిశివాని, ఆర్డీఓ నవీన్‌, ఆయా శాఖల అధికారులు, అమరరాజా కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పర్యటన షెడ్యూల్‌ ఇలా..

మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీ నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి 1.15 గంటలకు దివిటిపల్లికి చేరుకుంటారు.

1.20 నుంచి 2.20 గంటల వరకు అమరరాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌లో కొత్తగా నిర్మించిన కస్టమర్‌ క్వాలిఫికేషన్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవం, ప్లాంట్‌ పర్యటన, ప్రసంగం ఉంటుంది.

మధ్యాహ్నం 2.20 గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో బయలుదేరి 2.45 గంటలకు వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవం, విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement