కొత్తకోట రూరల్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బుధవారం కొత్తకోటలో పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. మంగళవారం కొత్తకోటలోని బీపీఆర్ గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైందని, భద్రతలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. బందోబస్తును ఎనిమిది సెక్టార్లుగా విభజించామని.. ఎస్పీ, అదనపు ఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 54 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ప్రత్యేక బృందాలు, డాగ్ స్క్వాడ్, సెక్యూరిటీ వింగ్, మఫ్టీ పార్టీలు తదితరులతో మొత్తం 850 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పోలీసు అధికారి విధుల్లో పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని, సెల్‌ఫోన్లు చూస్తూ లేదా వ్యక్తిగత పనుల్లో నిమగ్నమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, పరిస్థితులు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ట్రాఫిక్, పార్కింగ్, వీఐపీ రూట్లు, సభా ప్రాంగణం తదితర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూనే భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదన్నారు. సమన్వయంతో పనిచేస్తేనే ముఖ్యమంత్రి పర్యటన విజయవంతమవుతుందన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీలు గిరిబాబు, బాలాజీనాయక్, శ్రీనివాసులు, కొత్తకోట, వనపర్తి సీఐలు రాంబాబు, సుగంధరత్నం, కొత్తకోట ఎస్‌ఐ శివానందంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


