భరోసా ఏది?
ఉపాధి కల్పించాలి
మున్సిపాలిటీగా మారితే తమ బతుకులు మారుతాయని ఆశపడ్డాం. కానీ ఉన్న ఉపాధి పనులు తీసేస్తారని అనుకోలేదు. ఆరేళ్ల నుంచి ఉపాధి పనులు లేక ఇంట్లో బీడీలు చుడుతూ కాలం వెళ్లదీస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో సైతం ఉపాధి పనులు చేపట్టి తమలాంటి పేదలకు ఉపాధి చూపాలి. లేదా ఏడాదికి ఇస్తామన్నా రూ.12 వేల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఆదుకోవాలి.
– ఎస్.నర్సింహులు, అమరచింత
పనులు లేక ఇబ్బంది
వంద రోజుల పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. అప్పుడు చేసిన పనికి తగ్గ కూలి వచ్చేది. ఇప్పుడు వ్యవసాయం కూలీ పనులు దొరకడం లేదు. వయస్సు భారమవ్వడంతో నాటు వేసే పనులు చేయలేకపోతున్నా. దీనికి తోడు కూలీలకు ఇచ్చే ఆత్మీయ భరోసా అందడం లేదు. దీంతో ఉపాధి లేక బతుకు భారంగా మారింది.
– వెంకటమ్మ, అమరచింత
ఆందోళన ఉధృతం చేస్తాం
మున్సిపాలిటీల్లో తొలగించిన ఉపాధి హామీ పనులను యథావిధిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న ఆత్మీయ భరోసాను వర్తింపచేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు ప్రవేశ పెట్టాలని ఆందోళన నిర్వహిస్తున్నాం. – అజయ్,
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు.
పట్టణ ప్రాంతాలకు వర్తించదు
2023–24 సంవత్సరంలో ఏర్పడిన మున్సిపాలిటీ ప్రాంతాల్లోని కూలీలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తిస్తుందని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అంతకు ముందు ఏర్పడిన మున్సిపాలిటీలో ఇది వర్తించదు. వీటిపై పట్టణ కూలీలకు అవగాహన కల్పించాం. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు చేసే వారిని గుర్తించే వీలుంది.
– రఘపతిరెడ్డి, ఏపీఓ, అమరచింత
మున్సిపాలిటీల్లో పేదలకు దూరంగానే ఉపాధి హామీ పథకం
అమరచింత: నిరుపేద వ్యవసాయ కూలీలతో పాటు పేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2006 ఫిబ్రవరి 2న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లోనే పేదలకు 100 రోజులు పని కల్పిస్తూ.. అందుకు తగ్గ కూలి చెల్లించేది. అనంతరం ఏడాదికి 150 రోజుల పనిదినాలకు పెంచారు. దీంతో గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలకు వేసవిలో పనులు దొరకడంతో కుటుంబ పోషణ సాఫీగా సాగేది. ప్రస్తుతం పట్టణాలు, మున్సిపాలిటీల్లో ఉపాధి పనులను తొలగించడంతో ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు పనులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గతంలో గ్రామ పంచాయతీలుగా ఉండి కొత్తగా మున్సిపాలిటీలుగా ఏర్పడిన పట్టణాలోల పేదలకు ఉపాధికి దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా సంవత్సరానికి రూ.12 వేలు చెల్లిస్తుండడంతో ఉపాధి కోల్పోయిన పట్టణ ప్రాంత కూలీలు సైతం తమకు పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిలో కనీసం 20 రోజుల పనిదినాలు చేసిన కూలీలు అర్హులంటూ నిబంధనలు ఉండడంతో.. మున్సిపాలిటీల్లో ఉపాధి హామీ పథకమే అమలులో లేని కారణంగా వీరు ఆత్మీయ భరోసా అనర్హులుగా మిగిలారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో 13,242 మంది జాబ్ కార్డు ఉండగా.. వారికి ఉపాధి హామీ, ఆత్మీయ భరోసా రెండు పథకాలు అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, వారికి న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టిపట్టనట్టుగా వ్యవహరిస్తుంది.
జిల్లాలో ఇలా..
జిల్లాల పునర్విభజనలో భాగంగా 2018 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే మున్సిపాలిటీగా ఉన్న వనపర్తితో పాటు పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత పట్టణాలను మున్సిపాలిటీలుగా ప్రకటించింది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో ఉపాధి పనులపై ఆధారపడి జీవిస్తున్న 13,242 మంది కూలీలు పనులు కోల్పోయారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో రాజనగరంలో 479, నాగవరంలో 643 శ్రీనివాసపురంలో 1,020, నర్సింగాపురంలో 70 మంది ఉపాధి పనులకు దూరమయ్యారు. పెబ్బేరు మున్సిపాలిటీలో పెబ్బేరు పట్టణంలో 2,245, చెలిమిలలో 872 మంది, కొత్తకోట మున్సిపాలిటీలో 1,915 మంది, ఆత్మకూర్ మున్సిపాలిటీలో 1,975 విలీన గ్రామమైన ఖానాపురంలో 568 మంది, అమరచింత మున్సిపాలిటీలో 4,093 మంది కూలీలు జాబ్‌కార్డులు కలిగి ఉన్నా ఉపాధి పనులు చేసేందుకు అనర్హులుగా మిగిలారు. దీంతో అప్పటి నుంచి తమకు ఉపాధి పనులు కల్పించాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరుగుతున్నా తమను పట్టించుకునే వారే కరువయ్యారని కూలీలు వాపోతున్నారు.
పట్టణ కూలీలకు అందని ‘ఆత్మీయ భరోసా’
భారమవుతున్న దినసరి జీవనం
ఇందిరమ్మ రాజ్యంలోనూ ఉపాధి కలే..
మున్సిపాలిటీల ఏర్పాటుతో పేదల బతుకుల్లో చీకటి
భరోసా ఏది?
భరోసా ఏది?


