జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక
వనపర్తిటౌన్: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ విక్టోరియా మెమోరియల్ స్టేడియంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 3, 4 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 69వ అండర్–19 పోటీల్లో స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న కార్తీక్ జాతీయస్థాయికి ఎంపికయ్యాడని ఎస్జీఎఫ్ సెక్రటరీ కుమార్ తెలిపారు. జయసూర్య ఉత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. ఈ మేరకు విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ గురువయ్య శాలువాతో ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, వనపర్తికి గౌరవం దక్కేలా ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. గతేడాది జయసూర్య జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడన్నారు. కార్యక్రమంలో పీడీలు నవీన్ నందన్, నరేందర్, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు.
616 ఫిర్యాదులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పురపాలికల పరిధిలో ఓటర్ల ముసాయిదా జాబితాపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు.. మిగిలిన 18 మున్సిపాలిటీలో మొత్తం 316 వార్డులు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటివరకు మొత్తంగా 616 అభ్యంతరాలు వచ్చాయి. అదేవిధంగా సోమవారం ఆయా పురిపాలికల పరిధిలో అధికారులు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పలు అభ్యంతరాలు చెబుతూ.. పరిష్కరించాలని విన్నవించారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 60 డివిజన్ల పరిధిలో 144 ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపాలిటీల విషయానికి వస్తే.. దేవరకద్రలో 9, నాగర్‌కర్నూల్‌లో 121, కొల్లాపూర్‌లో 8, కల్వకుర్తిలో 36, నారాయణపేటలో 4, మక్తల్ 10, కోస్గిలో 5, మద్దూరులో 16, గద్వాలో 17, అయిజలో 22, వడ్డేపల్లిలో 36, వనపర్తిలో 8, కొత్తకోటలో 6, అమరచింత 4, ఆత్మకూర్‌లో 11, పెబ్బేరులో 71 ఫిర్యాదులు రాగా.. అలంపూర్ మున్సిపాలిటీలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు.
రామన్‌పాడులో 1,020 అడుగుల నీటి మట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో సోమవారం నాటికి సముద్రమట్టానికి పైన పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు గాను 1,020 అడుగుల వద్ద నీటి నిల్వ ఉంది. జూరాల ఎడమ కాల్వ, సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపేశారు. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 875 క్యూసెక్కులు, కుడి ఎడమ కాల్వ ద్వారా 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని ఏఈ వరప్రసాద్ తెలిపారు.


