‘పది’లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
పాన్‌గల్: పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, మధ్యాహ్న భోజనం పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థుల అల్పాహారానికి సంబంధించిన నిధులు త్వరలోనే విడుదల అవుతాయన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రైవేటుకు ధీటుగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పాఠ్యాంశాల వారీగా విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేయాలని సూచించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని.. కోడిగుడ్ల ధర పెరిగినందున వారంలో రెండుసార్లు అందించడంతో పాటు ఒకసారి అరటి పండు ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులు వర్గాలుగా ఏర్పడి విద్యార్థులకు నష్టం కలిగించే పనులు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమష్టిగా ఉంటూ విద్యార్థుల అభివృద్ధి, విద్య బలోపేతానికి కృషి చేయాలన్నారు. మండలంలోని పలువురు ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా గతంలో జరిగిందని.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అలా కాకుండా చూస్తామని తెలిపారు. పీఎంశ్రీ నిధులను పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేయాలని హెచ్‌ఎంకు సూచించారు. ఆయన వెంట మండల విద్యాధికారి ఆనంద్, జీహెచ్‌ఎం నాగలీల, ఉపాధ్యాయ బృందం ఉన్నారు.
రేపు జిల్లాస్థాయి
అథ్లెటిక్స్ ఎంపికలు
వనపర్తిటౌన్: ఆదిలాబాద్‌లో జరగబోయే రాష్ట్రస్థాయి 11వ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా జట్టు ఎంపికలు గురువారం నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని బాలకిష్ణయ్య క్రీడా ప్రాంగణంలో ఎంపికలు ఉంటాయని.. అండర్ 8 జట్టుకు 19.01.2018 నుంచి 18.01.2020 మధ్య, అండర్ 10 జట్టుకు 19.01.2016 నుంచి 18.01.2018 మధ్య, అండర్ 12 జట్టుకు 19.01.2014 నుంచి 18.01.2016 మధ్య, అండర్ 14 జట్టుకు 19.01.2012 నుంచి 18.01.2014 మధ్య, అండర్ 20 జట్టుకు 19.01.2006 నుంచి 18.01.2012 మధ్య జన్మించిన బాలబాలికలు అర్హులని వివరించారు. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 9 గంటలలోపు మైదానంలో రిపోర్ట్ చేయాలని.. పూర్తి వివరాలకు సెల్‌నంబర్లు 80961 15222, 94413 53375 సంప్రదించాలని పేర్కొన్నారు.


