అభ్యంతరాల పరిష్కారానికి కృషి
వనపర్తి: పుర ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో ఫొటోలు లేకపోవడం, డబుల్ ఓట్లు, తప్పుగా వార్డుల మ్యాపింగ్, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సౌకర్యాల కల్పన తదితర అభ్యంతరాలను ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముసాయిదా ఓటరు జాబితాలో ఫొటోలు లేని విషయం వాస్తవమని, ఫొటోలతో కూడిన జాబితా ప్రచురించేలా ఎన్నికల సంఘానికి నివేదిస్తామని చెప్పారు. అదేవిధంగా డబుల్ ఓట్లు ఏవైనా ఉంటే తప్పనిసరిగా తొలగిస్తామని.. వార్డు మ్యాపింగ్‌లోని అభ్యంతరాల ఆధారంగా సరి చేస్తామని తెలిపారు. గ్రామీణ ఓటర్లు ఎక్కడైనా నమోదై ఉంటే తప్పనిసరిగా తొలగిస్తామని వివరించారు. అలాంటి ఓటర్లు ఎవరైనా ఉన్నట్లు తెలిస్తే అధికారులకు తెలియజేయాలని సూచించారు. 10వ తేదీన చివరి డ్రాఫ్ట్ వెలువరిస్తామని, ప్రతి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి ఓటరు జాబితా కాపీలను తప్పనిసరిగా ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండు వేలకుపైగా ఓటర్లున్న వార్డుల్లో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని.. మిగతా వార్డుల్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పనుల్లో వేగం పెంచాలి..
ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనుల్ని వేగంగా పూర్తిచేసి ఫిబ్రవరి 15లోగా అప్పగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన వైద్య కళాశాల భవనంతో పాటు, మెనస్, వసతిగృహం, పార్కింగ్ ఏరియాను పరిశీలించి ఆర్‌అండ్‌బీ, ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు చివరి దశకు చేరుకున్నందున వేగం పెంచాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్‌అండ్‌బీ కార్యనిర్వాహక ఇంజినీర్ దేశ్యానాయక్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, ఇతర అధికారులు ఉన్నారు.


