నాణ్యతగా, వేగంగా ఔట్‌పోస్టు నిర్మాణం
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సమీపంలో నిర్మిస్తున్న పోలీస్ ఔట్‌పోస్టు పనుల్లో నాణ్యత పాటించడంతో పాటు అనుకున్న సమయంలోగా పూర్తి కావాలని ఎస్పీ సునీతరెడ్డి ఆదేశించారు. మంగళవారం ప్రాజెక్టు రహదారిలో సత్యసాయి తాగునీటి పంప్‌హౌజ్ వద్ద రూ.కోటితో నిర్మిస్తున్న పోలీస్ ఔట్‌పోస్టు పనులను ఆమె పరిశీలించి మాట్లాడారు. పనుల్లో అధికారుల నిర్లక్ష్యంతో పాటు కాంట్రాక్టర్ అలసత్వాన్ని ఉపేక్షించేది లేదన్నారు. ప్రజల భద్రతకు పునాది పోలీసు మౌలిక వసతులేనని వెల్లడించారు. ఔట్‌పోస్టు నిర్మాణంతో ప్రాజెక్టుకు రక్షణతో పాటు అంతర్రాష్ట్ర రవాణాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పటిష్ట నిఘా ఉంటుందన్నారు. ప్రాజెక్టు సమీపంలో అల్లరిమూకలు, ఆకతాయిల బెడద ఉండదని.. ప్రజా రక్షణ కోసమే ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు చెప్పారు.
ఠాణా నిర్మాణానికి స్థల పరిశీలన..
పట్టణంలోని దుంపాయికుంటలో పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని మంగళవారం ఎస్పీ సునీతరెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం 1.20 ఎకరాల స్థలం కేటాయించారని.. అదనంగా 1.20 ఎకరాలు రెవెన్యూ అధికారులు అప్పగిస్తే పోలీస్‌స్టేషన్‌తో పాటు సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఆధునిక వసతులతో నిర్మించే పోలీస్‌స్టేషన్‌కు మూడు ఎకరాల స్థలం అవసరమని.. సంబంధిత అధికారులకు నివేదిక అందించాలని సీఐ శివకుమార్‌ను ఆదేశించారు. ఆమె వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ శివకుమార్, ఎస్‌ఐ స్వాతి, ఆత్మకూర్ ఎస్‌ఐ జయన్న, సిబ్బంది ఉన్నారు.


