వ్యూహరచన..!
‘పుర’ పోరుపై ముమ్మర కసరత్తు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘పుర’ పోరుపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. కార్పొరేషన్/మున్సిపల్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడినప్పటికీ సం‘గ్రామంశ్రీలో బీఆర్‌ఎస్ అనూహ్యంగా పుంజుకోవడం.. శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపింది. గతంతో పోల్చితే మెరుగైన పంచాయతీ స్థానాలను సాధించడంతో బీజేపీలోనూ జోష్ నెలకొంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలు పోటాపోటీగా పోరు సన్నాహాలకు శ్రీకారం చుట్టాయి. పుర పాలికల ఎన్నికల్లో పాగా వేసేలా వ్యూహాలు పన్నుతున్నాయి.
వెలిసిన ఫ్లెక్సీలు.. విందులు
పురపాలిక ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించిన క్రమంలో ఆయా డివిజన్లు/వార్డుల్లోని ఆశావహ అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించారు. యువతను ఆకట్టుకునేందుకు విందులకు తెర లేపారు. తాము బరిలో నిలుస్తామనే సంకేతాలను వార్డు ప్రజలకు తెలిసేలా ప్రచారం ప్రారంభించారు ఈ క్రమంలో దాదాపుగా అన్ని వార్డుల్లోనూ నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి, ఉగాది శుభాకాంక్షలు చెబుతూ భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే తమకే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల కార్యాలయాలతో పాటు వార్డుల్లో రాజకీయ సందడి నెలకొంది. ప్రధానంగా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన మహబూబ్‌నగర్ పీఠంపై అన్ని రాజకీయ పార్టీలు కన్నేశాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులతో పాటు పార్టీల నాయకుల మధ్య కూడా పోరు రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్: పట్టు నిలుపుకొనేలా..
గత మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్‌ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల క్రమంలో పట్టు నిలుపుకునేలా తగిన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ప్రత్యక్షంగా ఇప్పటివరకు ఎలాంటి సన్నాహక సమావేశాలు నిర్వహించకున్నా.. ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలు తమ తమ అనుచరుల ద్వారా గెలుపు గుర్రాలపై జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆయా వార్డుల్లో ఆశావహులను ప్రోత్సహిస్తూ రంగం సిద్ధం చేసుకోవాలని.. రిజర్వేషన్ల ప్రకారం పార్టీ నిర్ణయం మేరకు నడుచుకునేలా వారిని సమాయత్తం చేస్తున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్ పన్నుతున్న వ్యూహాలను పరిశీలిస్తూ.. పై ఎత్తులతో పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు.
ప్రధాన పార్టీలసన్నాహకాలు షురూ
అభ్యర్థుల జల్లెడకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్
ఆశావహుల నుంచి వ్యక్తిగత సమాచార సేకరణ
బీఆర్‌ఎస్, బీజేపీ సైతం రంగంలోకి..
ఎత్తులకు పైఎత్తులతో ముందుకు..


