పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
వనపర్తి: జిల్లాలో భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా వచ్చిన పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ భూభారతి పెండింగ్ దరఖాస్తులపై అన్ని మండలాల తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో మండల స్థాయి నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్ లాగిన్‌కు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ఫిజికల్ ఫైళ్లను రెండు రోజుల్లో పంపించాలని తహసీల్దార్లకు సూచించారు. వాటికి సంవత్సరం వారీగా పహాణీలను కూడా జత చేయాలన్నారు. కొత్త మండలాల్లో కార్యాలయాల భవనాల నిర్మాణంపై ఆరా తీశారు. జనవరి 26న ప్రభుత్వ భవనాల్లోనే జెండా ఎగురవేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీలో ప్రకటించిన ఓటరు ముసాయిదాపై ఫిర్యాదులు వస్తున్నాయని, తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లను సమన్వయం చేసుకొని వాటిని పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్.ఖీమ్యానాయక్, ఏఓ భానుప్రకాష్ పాల్గొన్నారు.
వక్ఫ్ భూములు కాపాడాలి
జిల్లాలో గెజిట్ ప్రకారం వక్ఫ్ భూములు 898.36 ఎకరాలు ఉండగా.. అక్కడక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయని, వాటిని కాపాడాలని సంబంధింత అధికారులను కలెక్టర్ ఆదర్శ్‌సురభి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వక్ఫ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్ఫ్ భూముల ఆక్రమణలపై కమిటీ సభ్యులు కలెక్టర్‌కు వివరించగా.. వాటికి సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భరోసానిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బాలాజీనాయక్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అఫ్జలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


