
గంజాయి రహిత జిల్లాగా మారుద్దాం
వనపర్తి: జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేయడం, వినియోగించడం కానీ జరుగకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని కలెక్టర్ ఆదర్శ్‌సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశంలో సంబంధిత శాఖల నుంచి అధికారులు నివేదిక సమర్పించారు. మాదక ద్రవ్యాల సరఫరాపై పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో ఉన్న క్యాంటీన్లు, పాన్‌షాప్‌లు, వైన్ షాపుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ నిఘా పెట్టాలని ఎకై ్సజ్, డ్రగ్ తనిఖీ అధికారులకు సూచించారు. జిల్లాలోని కళాశాలల్లో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ కమిటీలను క్రియాశీలంగా మార్చి, ప్రతి నెల మొదటి శుక్రవారం యాంటీ డ్రగ్ సమావేశాలు నిర్వహించాలని, విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి, జిల్లా విద్యా శాఖ అధికారిని ఆదేశించారు.
జిల్లాలో 6 కేసులు
2025 సంవత్సరంలో ఇప్పటి వరకు వనపర్తి పట్టణంలో 2, గోపాల్‌పేట మండలంలో 2, పెబ్బేరులో 2 కేసులు కలిపి మొత్తం 6 కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. మాదక ద్రవ్యాలు వినియోగించే వారిపై, సరఫరా చేసే వారిపై, గంజాయి పండించే వారిపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల శిక్షణ పొందిన పోలీస్ శునకాలు మాదక ద్రవ్యాలను సులువుగా గుర్తిస్తున్నాయని, వీటి సహాయంతో అనుమానం వస్తే కళాశాలల్లోనూ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్.ఖీమ్యానాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనివాస్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యానాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణికి 36 ఫిర్యాదులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.
మాట్లాడుతున్న కలెక్టర్ ఆదర్శ్‌సురభి
కలెక్టర్ ఆదర్శ్ సురభి