ఎడ్యుకేషన్‌.. ఇరిగేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఎడ్యుకేషన్‌.. ఇరిగేషన్‌

Sep 4 2025 10:13 AM | Updated on Sep 4 2025 10:29 AM

CM Revanth Reddy inaugurates the second unit of SGD Technologies Company.. Minister Jupally MLA Madhusudhan Reddy in the Pic

ఎస్‌జీడీ టెక్నాలజీస్ కంపెనీ రెండో యూనిట్ ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. చిత్రంలో మంత్రి జూపల్లి. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

ఇవే పాలమూరు తలరాతను మారుస్తాయి

ఏ అవకాశం వచ్చినా మొదటి ముద్ద పాలమూరుకే..

ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా..

అప్పుడే వలసలు ఆగుతాయి..

ఎస్‌జీడీ ఫార్మా 2వ యూనిట్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

కొడంగల్‌’ భూనిర్వాసిత రైతులకు న్యాయం చేస్తాం

పాలమూరుకే మొదటి ముద్ద.. పేదరికం, వలసలు, సమస్యలను చూపించడానికి నాటి పాలకులు ప్రపంచ నాయకులను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేవారు. భవిష్యత్‌లో మన అభివృద్ధి, పరిశ్రమలు, యూనివర్సిటీలు, సాగునీటి ప్రాజెక్టులను సందర్శించేలా అభివృద్ధి చేసుకోవాలి.  వీటిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు రావాలి. పరిశ్రమలు కావాలంటే భూములు కావాలి. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాటి వివరాలను అధికారులు నాకు పంపాలి. ఏ పరిశ్రమ వచ్చినా మొదటగా పాలమూరుకు పంపుతాను. నాకు ఏ అవకాశం వచ్చినా మొదటి ముద్ద పాలమూరు ప్రజలకు పెడుతా. మంత్రి వర్గంలోని మంత్రులు ఏమనుకున్నా మంచిదే.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసలకు మారుపేరు. ఈ దేశంలో భాక్రానంగల్‌, నాగార్జునసాగర్‌, ఎస్సారెస్పీ.. ఇలా ఏ మూలన ప్రాజెక్ట్‌లు కట్టినా తట్ట పని, మట్టి పని చేయాలంటే పాలమూరు బిడ్డలే కావాలి. వారి భాగస్వామ్యం లేకుంటే ఏ నిర్మాణాలు పూర్తి కాలేదు. దీనికి ప్రధానం కారణం చదువులో వెనకబాటు, సాగు నీరు అందుబాటులో లేకపోవడమే. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాల్లోని పెద్దలు ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పటికీ వలసలు ఆగలేదు. అందుకే పాలమూరు బిడ్డగా నా బాధ్యత నెరవేరుస్తా. ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌ లక్ష్యంగా పాలమూరు జిల్లా ప్రజల తలరాతలు మార్చేందుకు కృషి చేస్తా.’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 

మహబూబ్‌నగర్‌ జిల్లా ముసాపేట మండలం వేముల శివారులోని ఎస్‌జీడీ ఫార్మా కార్నింగ్‌ టెక్నాలజీస్‌ రెండో యూనిట్‌ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఫర్నేస్‌ లైటింగ్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ ‘పాలమూరు బిడ్డల చదువు కోసం ఏది కావాలన్నా.. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పాలమూరు ప్రాజెక్ట్‌లకు గ్రీన్‌చానల్‌ ద్వారా నిధులు అందించి పూర్తి చేస్తాం. రాజకీయ కారణాలతో అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్నవాళ్లమవుతాం.’ అని పేర్కొన్నారు. ఇంకా రేవంత్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. 

రైతులకు న్యాయం చేస్తాం..

ర్ణాటక సరిహద్దులో అత్యంత వెనుకబడిన ప్రాంతం మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌. ఈ ప్రాంతానికి నీళ్ల కోసం 2014లో ఉమ్మడి రాష్ట్రంలో 69 జీఓ ద్వారా తెచ్చుకుంటే ఎంపీగా పనిచేసిన కేసీఆర్‌ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి మా ప్రాజెక్టును తొక్కిపెట్టి అన్యాయం చేశారు. అందుకే సుమారు రూ.4 వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్‌కు టెండర్లు పిలిచి ముందుకు వెళుతుంటే.. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేసి అడ్డుకుంటున్నారు. కొడంగల్‌లో కోల్పోయినవి కమర్షియల్‌ భూములు కావడంతో అక్కడి వారికి ఎకరాకు రూ.20 లక్షలు ఇచ్చారు. మిగతా ప్రాంతాల్లో రూ.11 లక్షల వరకు ఇచ్చాం. నారాయణపేటలో రూ.14 లక్షలు ఇస్తున్నాం. భూసేకరణకు సంబంధించిన వివాదాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యే, కలెక్టర్‌ రైతులతో మాట్లాడాలి.. భూసేకరణ విషయంలో వారంపాటు సమయం కేటాయించి రైతులతో మాట్లాడాలి. వారిని ఒప్పించి.. మంచి పరిహారం అందించాలి. 

భూములు కోల్పోతున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి. రైతులకు నష్టం జరిగితే మాకు జరిగినట్లే. మీకు న్యాయం చేసే బాధ్యత మాది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు వికారాబాద్‌– కృష్ణా రైల్వేలైన్‌ పూర్తి చేసుకోకపోతే, పాలమూరు–రంగారెడ్డి, భీమా, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లు పూర్తి చేసుకోకపోతే.. ఎప్పుడూ పూర్తి చేసుకోలేం. నిధుల ఇబ్బందులు ఉన్నా.. మన జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి అందజేస్తున్నాం. రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి, పర్ణికా రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, ఎస్‌జీడీ టెక్నాలజీస్‌ ఎండీ దీపక్‌ సర్జిత్‌, సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గానికో ఏటీసీ..

హైదరాబాద్‌ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే మళ్లీ 75 ఏళ్ల తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు నాయకత్వం వహిస్తున్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే.. విద్య, ఇరిగేషన్‌, ఉపాధి రంగాల్లో సరైన ప్రణాళికతో జిల్లాను అభివృద్ధి చేసుకోకపోతే శాశ్వాతంగా మన జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది. అందుకే ఇంజనీరింగ్‌, లా కాలేజీ, డిగ్రీ కాలేజీలతో పాటు ట్రిపుల్‌ ఐటీని పాలమూరు జిల్లాకు మంజూరు చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఒక్కో నియోజకవర్గానికి రూ.200 కోట్ల చొప్పున రూ.2,800 కోట్లతో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 

అంతేకాకుండా ఉమ్మడి పాలమూరులో 14 అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్ల (ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్నాం. దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునే విధంగా ఆ సెంటర్లలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తాం. విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుంది. పాలమూరు బిడ్డలు వలసల బారి నుంచి బయటపడాలంటే చదువొక్కటే మార్గం. పాలమూరు జిల్లా నుంచి ఇంజినీర్లు, డాక్టర్లే కాదు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా ఎదగాలి. నూతన పరిశ్రమలకు వేదిక మహబూబ్‌నగర్‌ కాబోతోంది.

రాష్ట్రం వచ్చినా సముచిత న్యాయం జరగలేదు..

నాడు తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లా ప్రజలు అండగా నిలిచి మాజీ సీఎంను ఎంపీగా గెలిపించారు. పార్లమెంట్‌ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించినా.. రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి సముచిత న్యాయం జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పాలమూరు ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌, జూరాల, నెట్టంపాడు, కోయిల్‌సాగర్‌, భీమా లాంటి ప్రాజెక్టులు ఏవి కూడా సంపూర్ణంగా పూర్తికాలేదు. ఆనాడు సోనియాగాంధీ నాయకత్వంలో పాలమూరు యూనివర్సిటీ మంజూరు చేసినా అదొక పీజీ కళాశాలగా మిగిలిపోయింది. యూనివర్సిటీ హోదాలో ఉండాల్సిన ఇంజినీరింగ్‌, లా, ఇతర కళాశాలలు లేకపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement