
చేప పిల్లలు.. చెరువులకు చేరేనా?
అమరచింత: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం రూ.122 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది. కానీ వీటికి సంబంధించిన విధివిధానాలు జిల్లాలకు అందకపోవడంతో ఉచిత చేపపిల్లల పంపిణీ ఎప్పుడు జరుగుతుందోనని మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పుకొస్తున్న ప్రభుత్వం.. జిల్లాలోని చెరువులకు ఎన్ని లక్షల చేప పిల్లలను ఇస్తున్నారనే విషయాలను నేటికీ అంచనా వేయకపోవడంతో మరో నెల సమయం పడుతుందన్న సందేహాలతో మత్స్యకారులు కాలం నెట్టుకొస్తున్నారు. సకాలంలో చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదలకపోతే ఆశించిన మేర పెరగవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో కేవలం 54.84 లక్షల చేప పిల్లలను మాత్రమే మత్స్యశాఖ అధికారులు వదిలారు. ఈ ఏడాది రెండు కోట్ల చేప పిల్లలను పూర్తిస్థాయిలో అన్ని సొసైటీలకు ఉచితంగా అందించి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఇప్పటికే పుణ్యకాలం దాటిపోతుందని.. త్వరగా టెండర్ ప్రక్రియ పూర్తిచేసి చేప పిల్లలను వెంటనే అందించాలంటున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లావ్యాప్తంగా 1,052 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో గతేడాది అనుకున్న లక్ష్యంలో సగం అంటే 54.84 లక్షల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో 143 మత్స్య సహకార సంఘాలు ఉండగా, 13,600 మంది మత్స్యకారులు చేపల విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏడాది పొడవునా జీవనాధారంగా ఉన్న చేపలను చెరువుల్లో పెంచుకొనేందుకు ఇప్పటికే మత్స్యకారులు సొంతంగా సీడ్‌ను ఆంధ్రా నుంచి దిగుమతి చేసుకొని వదిలేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే చేప పిల్లలతో పాటు సొసైటీ ద్వారా డబ్బులు వెచ్చించి తమ ప్రాంతాల్లో అమ్ముడుపోయే చేప పిల్లలను కొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయని.. ప్రభుత్వం త్వరగా పిల్లలను కొనుగోలు చేసి సొసైటీలకు అప్పగించాలని కోరుతున్నారు.
చేప పిల్లల పరిశీలనలు..
నాణ్యమైన చేప పిల్లలను మత్స్యకారులకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా మత్స్యశాఖ అధికారుల బృందాలుగా ఏర్పడి పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి చేప పిల్లలు, ధరలు తెలుసుకుంటారు. ఈసారి ఇప్పటికే పర్యటించి టెండర్లను ఆహ్వానించాల్సి ఉంది. కాని ప్రభుత్వం ఆలస్యంగా నిధులు మంజూరు చేయడంతో అధికారులు వేగంగా ఇందుకు సంబంధించిన విధివిధానాలు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీకి నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే జిల్లా మత్స్య సొసైటీలకు ఎంత మేరకు చేప పిల్లలు ఇవ్వాలనే ప్రణాళికలు రూపొందించుకొని వాటి ప్రకారం కొనుగోలుకు టెండర్లు ఆహ్వానిస్తాం. చేప పిల్లలు వచ్చిన వెంటనే పంపిణీకి చర్యలు తీసుకుంటాం.
– డా. లక్ష్మప్ప, ఏడీ, మత్స్యశాఖ
ఆలస్యంగా వదిలితే నష్టమే..
అమరచింత పెద్ద చెరువుపై ఆధారపడి 300 మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను త్వరగా పంపిణీ చేసి ఆదుకోవాలి. ఆలస్యంగా పంపిణీ చేస్తే నష్టాలు తప్ప లాభాలు రావు. చేప పిల్లల పంపిణీ కోసం మరో నెల రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.
– గోపి, మత్స్యకారుడు, అమరచింత
చేప పిల్లలకు ఎదురుచూపులు..
ఈ ఏడాది ప్రభుత్వం పంపిణీ చేస్తే ఉచిత చేప పిల్లల కోసం ఎదురుచూస్తున్నాం. ప్రతి ఏటా ఇప్పటి వరకే చేప పిల్లలు చెరువులో వదిలేవాళ్లం. అధికారులు సైతం తమ చెరువుకు రావాల్సిన సబ్సిడీ చేప పిల్లలను అందించే వారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెబుతున్నారు.. త్వరగా సరఫరా చేసి ఆదుకోవాలి.
– తెలుగు రాములు, పాన్‌గల్
నిధులు విడుదల చేస్తున్నట్లు గత నెల ప్రకటించిన ప్రభుత్వం
విధివిధానాలపై అధికారుల కసరత్తు
జిల్లాలో 143 మత్స్య పారిశ్రామిక సొసైటీలు
గతేడాది పంపిణీ చేసింది 54.84 లక్షలే..
13,600 మంది మత్స్యకారులకు ఉపాధి