
ప్రయోగాల ద్వారా విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయులు మల్లేష్ కుమార్ (ఫైల్)
సాంకేతికత, సృజనాత్మకతతో ఆకట్టుకునేలా బోధన
అన్నిరంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న పలువురు ఉపాధ్యాయులు
నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
చెప్పడం కంటే కళ్లకు కట్టినట్లు చూపిస్తే పిల్లలకు పాఠాలు సులభంగా అర్థమవుతాయన్నది నిజం. పలువురు ఉపాధ్యాయులు కొంతకాలంగా ఇదే విధానాన్ని అవలంబిస్తూ పాఠాలు బోధిస్తూ విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. బోర్డుపై చిత్రాలు గీచి, పాఠ్య పుస్తకాల్లోని ఫొటోలు చూపించి బోధించడంలాంటి మూసధోరణికి స్వస్తి పలికి సాంకేతికతను జోడించి యానిమేషన్ వీడియోల ద్వారా బోధిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు పలువురు ఉపాధ్యాయులు. పాఠ్యాంశం చాలా కాలం గుర్తుండేలా వినూత్నంగా బోధిస్తూ.. వారిలోని సృజనాత్మకతను వెలికితీసి జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చేలా సంసిద్ధులను చేస్తున్నారు. మొత్తంగా గ్రామీణ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దుతూ పలువురు ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
దేవన్నకు రాష్ట్రస్థాయి పురస్కారం..
కొత్తకోట: మండలంలోని అప్పరాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న దేవన్న రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. అందరి ఉపాధ్యాయులుగా కాకుండా తాను ప్రత్యేకంగా ఉండాలన్న ఆయన తపన రాష్ట్రస్థాయి గుర్తింపునకు కారణమైంది. జిల్లా, రాష్ట్రస్థాయిలో సాంఘికశాస్త్ర ఫోరం నిర్వహించే ప్రతిభా పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దేవన్న ఎంతో కృషి చేశారు. గ్రామస్తులు, పూర్వ విద్యార్థుల చేయూతతో పాఠశాలలో మైక్‌సెట్, డ్యూయల్ డెస్క్ బేంచీలు, ప్రింటర్, అనేక పుస్తకాలు, గోడలపై రాష్ట్ర, దేశపటాలు, జాతీయ నాయకుల చిత్రచిత్రాలు గీయించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.
‘డిజిటల్’ టీచర్.. సంతోష్‌కుమార్
అమరచింత: సాంకేతికతపై పట్టు సాధించేందుకు నిరంతరం పరితపిస్తుంటారు ఆత్మకూర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సంతోష్‌కుమార్. ఆంగ్ల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న ఈయన ప్రత్యేకమైన తరగతి గదిలో ఆంగ్ల అక్షరాలు, ప్రొజెక్టర్ ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు బోధన అందిస్తూ ఆంగ్లంలో మెళకువలు నేర్పిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. గతంలో జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు సైతం ఈయనను సత్కరించారు. 1990లో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరిన సంతోష్‌కుమార్ ఉమ్మడి ఆత్మకూర్ మండలంలో 30 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ప్రత్యేక తరగతి గదిలో..
విద్యార్థులకు పుస్తకాల్లో ఉన్న విషయాలను నేర్పించడంతో పాటు సాంకేతికంగా కూడా విద్య అందిస్తున్నాం. వాయిస్ టోనింగ్ ద్వారా ఆంగ్లం, తెలుగు భాషలో పదాలు చెప్పడం, విద్యార్థులతో చెప్పించడంతో సులభంగా అర్థమవుతుంది. పాఠశాలలో తన కోసం ప్రత్యేక తరగతి గదిని కేటాయించడంతో ప్రయోగత్మకంగా డిజిటల్ ఆంగ్ల బోధన సాధ్యమవుతుంది. బోధనే కాకుండా ఆంగ్లంలో రైటింగ్ స్కిల్స్‌ను సైతం నేర్పిస్తున్నా. బోధన పరికరాలకు వేతనం నుంచి కొంత ఖర్చు చేయడంతోనే ఇది సాధ్యమవుతుంది.
– సంతోష్‌కుమార్, ఆంగ్ల ఉపాధ్యాయుడు
ఈ సారు.. బడిని మార్చారు
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై న విష్ణువర్ధన్‌నాయుడు
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలం పెంచికలపాడుకు చెందిన ఎన్.విష్ణువర్ధన్‌నాయుడు 2010లో ఎస్జీటీగా ఎంపికై మాగనూర్ మండలం ఓబులాపురం గ్రామ ప్రాథమిక పాఠశాలలో చేరారు. అక్కడి నుంచి 2015లో పెబ్బేరు మండలం సూగూరు ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వచ్చారు. ఈ పాఠశాలలో వాల్ పెయింటింగ్ చేయించి విద్యార్థులకు వినూత్న బోధన అందిస్తూ ప్రజల మన్ననలు పొందారు. అక్కడి నుంచి 2024లో శ్రీరంగాపురం మండలం నాగరాల 3వ కేంద్రం ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు. ఇక్కడ ఏకోపాధ్యాయుడిగా విధులో చేరి ఒకేగదిలో ఇద్దరు విద్యార్థులతో తరగతులు ప్రారంభించారు. తన స్నేహితుల సాయంతో పాఠశాలకు రంగులు వేయించి సామగ్రి సమకూర్చుకున్నారు. ఇతడికి పెయింటింగ్‌పై ఆసక్తి ఎక్కువ. పాఠశాల గోడలపై తెలుగు వర్ణమాల, ఇంగ్లీష్ అల్పాబెట్, అంకెలు, బొమ్మలు వేసి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థులకు సంఖ్య 16కి చేరింది. ఈయన కృషికిగాను ప్రభుత్వం ఆయనను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవార్డుకు ఎంపిక కావడం చాలా గర్వంగా ఉందని.. అవార్డు నాపై మరింత బాధ్యత పెంచిందన్నారు. నా సేవలను విద్యాశాఖ గుర్తించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. – జీవశాస్త్రంలో వినూత్న బోధనతో ఆకట్టుకుంటున్న ఉపాధ్యాయుడు
ప్రయోగాల మాస్టారు మల్లేష్
పాన్‌గల్: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల జీవశాస్త్రం ఉపాధ్యాయుడు మల్లేష్‌కుమార్ తన వినూత్న బోధనతో విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. ఈయనకు ప్రయోగాల మాస్టారుగా పేరుంది. సైన్స్ ప్రయోగాల ద్వారా విద్యార్థి సంపూర్ణంగా నేర్చుకుంటారని చెబుతుంటారాయన. గుండె, మూత్రపిండాలు, జ్ఞానేంద్రియాలు మొదలగు అవయవాలను డిజిటిల్ బోర్డుపై చూపిస్తూ బోధిస్తుంటారు.
● పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎన్‌జీసీ ఏకో క్లబ్ ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్స్ అభివృద్ధి, వన మహోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ప్రపంచ జల దినోత్సవం, ప్లాస్టిక్ నిషేధం వంటివి నిర్వహించి పిల్లలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛతలో భాగంగా పిల్లలు చేతులు శుభ్రం చేసుకునే విధానం, మరుగుదొడ్లను వినియోగించడం, నులిపురుగులు, అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు.
● ఎకో క్లబ్‌లో భాగంగా మట్టి గణపతులు, పేపర్ బ్యాగుల తయారీ , ఏకో రాఖీ, ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులు పాఠశాల, మండల, జిల్లాస్థాయి సైన్స్ మేళాల్లో పాల్గొనేలా సిద్ధం చేస్తుంటారు. సైన్స్, బాలల, గణిత దినోత్సవం సందర్భంగా పిల్లలకు వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు.
● తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రగతిపై చర్చించడంతో పాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు.
భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. అందుకు అనుగుణంగా వినూత్న పద్ధతులను అవలంబిస్తూ విద్యార్థులకు బోధిస్తూ ఆయా లక్ష్యాల వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నా.
– మల్లేష్‌కుమార్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, జెడ్పీ ఉన్నత పాఠశాల, పాన్‌గల్
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు 56 మంది
● శనివారం పురస్కారాల అందజేత
వనపర్తిటౌన్: జిల్లావ్యాప్తంగా 56 మంది ఉత్తమ ఉపాధ్యాయును ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ గురువారం రాత్రి తెలిపారు. ఏ ప్రాతిపదికన, ఏయే అంశాలు పరిగణలోకి తీసుకొని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయాలని ఉదయం నుంచి పలు ఉపాధ్యాయ సంఘాలతో ఆయన విస్తృతంగా చర్చించారు. డీఈఓ కార్యాలయంలో అదనపు బాధ్యతలు, ఫారెన్ సర్వీస్‌లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల కనుసన్నల్లో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ కొనసాగినట్లు ప్రచారం సాగింది. గురువారం రాత్రి 9 వరకు కూడా కసరత్తు ఓ కొలిక్కి రాలేదు. మండలాల వారీగా, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని డీఈఓ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంపిక కమిటీ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ సెలవురోజు కావడంతో ఎంపిక వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచాలని అధికారులు నిర్ణయించినట్లు చెబుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉందనే ఉద్ధేశంతో డీఈఓ వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడటం లేదని విద్యాశాఖలో ప్రచారం జరుగుతోంది. ఒక గజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు, 24 మంది స్కూల్ అసిస్టెంట్లు, 21 మంది ఎస్జీటీలు, నలుగురు ఎల్‌ఎఫ్‌ఎల్ ఉపాధ్యాయులు, ఇద్దరు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, కేజీబీవీ ఉపాధ్యాయులు ముగ్గురు, ఒక పీడీ ఉన్నారు. ఈసారి మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు తొలిసారిగా వరించాయి.
విశేష సేవలకు గుర్తింపు
పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డికి రాష్ట్రస్థాయి అవార్డు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో కొన్ని సంవత్సరాలుగా అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తూ.. పీజీ కళాశాల ప్రిన్సిపాల్, ఐక్యూఏసీ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డును ప్రకటించింది. ఆయన యూజీ, పీజీ స్థాయిలో పనిచేయడంతోపాటు ఆయన చేసిన 35 పరిశోధనలకు జాతీయ, అంతర్జాతయ స్థాయిలో రీసెర్చ్ పత్రాలను సమర్పించారు. 11పుస్తకాలను జాతీయ, అంతర్జాతీయ పబ్లిషర్స్ పబ్లిష్ చేశాయి. ఆయన చేసిన రెండు రీసెర్చ్‌లకు రూ.56లక్షలతో ప్రాజెక్టులు వచ్చాయి. దీంతోపాటు పీయూ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, వీసీ ఓఎస్డీ, ఐక్యూఏసీ డైరెక్టర్, బోర్డు ఆఫ్ స్టడీస్ డైరెక్టర్‌తోపాటు ఐదుగురు వీసీలు, ఏడుగురు రిజిస్ట్రార్‌ల వద్ద అడ్మినిస్ట్రేషన్ పరంగా విధులు నిర్వహించడంతో ఆయనకు ప్రభుత్వం అవార్డును ప్రకటించింది.

స్వయంగా రూపొందించుకున్న తరగతి గది

నాగరాల పాఠశాల గోడలపై పదాలు రాస్తున్న ఉపాధ్యాయుడు విఘ్ణవర్ధన్ నాయుడు