
రైస్‌మిల్లుల ఏర్పాటులో నిబంధనలు తప్పనిసరి
ఖిల్లాఘనపురం: జిల్లాలో కొత్త రైస్‌మిల్లులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సూచించారు. గురువారం మండలంలోని మొగులుకుంటతండా సమీపంలో నిర్మాణంలో ఉన్న రైస్‌మిల్లును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే వరి ధాన్యాన్ని సకాలంలో మర ఆడించి ఎఫ్‌సీఐకి సీఎంఆర్ అప్పగించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో మిల్లులోని ధాన్యం నిల్వలో తేడాలు ఉండొద్దన్నారు.
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు..
భూ రిజిస్ట్రేషన్లకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే రైతులు ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సూచించారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి వివిధ పనుల నిమిత్తం వచ్చిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రోజుల తరబడి తిప్పించుకోకుండా సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు. దాతల సహకారంతో కార్యాలయం వెలుపల బెంచీలు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు.
అధికంగా వసూలు చేస్తే చర్యలు..
మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అధికంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్‌కు వచ్చిన ఓ రైతుతో మాట్లాడి మీ సేవా వారు ఎన్ని డబ్బులు తీసుకున్నారని అడిగారు. రూ.2,200 చెల్లించామని చెప్పగా.. 0.13 ఎకరాలకు రూ.850 తీసుకోవాల్సి ఉండగా అన్ని డబ్బులు ఎందుకు వసూలు చేశారని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. సదరు కేంద్రం నిర్వాహకుడితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. అనంతరం రికార్డుగదిని పరిశీలించారు. పాతవి తొలగించి కొత్తవాటిని ఉంచాలని చెప్పారు. ఆయనవెంట పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథం, తహసీల్దార్ సుగుణ, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్, సీనియర్ అసిస్టెంట్ కురుమూర్తి, ఆర్‌ఐ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్