
శాంతియుత వాతావరణంలో నిమజ్జనం
వనపర్తి: భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించి గణనాథులకు ఘనమైన వీడ్కోలు పలుకుదామని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. శుక్రవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు, ప్రమాదాలు జరగకుండా పటిష్ట భద్రత, బందోబస్తు కల్పిస్తున్నట్లు వివరించారు. గురువారం ఆయన జిల్లాకేంద్రంలోని నల్లచెరువు వద్ద నిమజ్జనం జరిగే ప్రదేశం, శోభాయాత్ర జరిగే మార్గాల్లో ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తయ్యేలా నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో రహదారుల మరమ్మతు, ఫ్లడ్ లైట్లు, క్రేన్లు, తాగునీటి వసతి కల్పించామని, నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఊరేగింపు కొనసాగుతుందని.. నిర్వాహకులు పూజలు త్వరగా ముగించి వెలుతురు ఉండగానే విగ్రహాలను జాగ్రత్తగా తరలించాలని సూచించారు. చిన్నపిల్లలు, మహిళలు శోభాయాత్రలో పాల్గొంటే ప్రమాదాలు జరగకుండా చూడాలని, ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనాలపై వచ్చే చిన్నారులు జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు. క్రేన్ సాయంతో నిమజ్జనం చేసే సమయంలో యువత, చిన్నారులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని, సహాయకులు అందుబాటులో ఉండాలన్నారు. శోభాయాత్రలో డీజేలు, బాణసంచా వినియోగించడం నిషేధమని.. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిమజ్జన కార్యక్రమం శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, వనపర్తి సీఐ కృష్ణయ్య, రిజర్వ్ సీఐ శ్రీనివాస్, వనపర్తి పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, పుర, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఎస్పీ రావుల గిరిధర్