
ఎఫ్‌డీఆర్ నిధులు ఖర్చు చేయాలి
వనపర్తి: జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టాలకు కేంద్ర విపత్తు నిర్వహణ ద్వారా మంజూరైన రూ.3 కోట్లను ఖర్చుచేసి యూసీలు సిద్ధం చేసి పంపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గత వర్షాకాలంలో వరదలతో ఎక్కడెక్కడ నష్టం వాటిల్లింది.. వాటి మరమ్మతుకు ఖర్చు చేసిన బిల్లులు సిద్ధం చేయాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో విద్య, రహదారులు, భవనాలు, సంక్షేమ, వైద్య, ఆరోగ్యశాఖ, నీటిపారుదల, మున్సిపాలిటీ తదితర శాఖల అధికారులో సమీక్ష నిర్వహించి నష్టాలు, చేపట్టిన మరమ్మతుపై చర్చించారు. పనులు ఎంత మేర పూర్తయ్యాయి, ఎన్ని పురోగతిలో ఉన్నాయన్న వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడెక్కడ ఎంత నష్టం వాటిల్లిందో నివేదిక అందజేయాలని, వాటి మరమ్మతుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని ఆదేశించారు. సమీక్షలో జిల్లా విద్యాధికారి మమ్మద్ ఘనీ, జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, పుర కమిషనర్లు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ అధికారులు, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.