
చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం
అమరచింత: ప్రతి ఒక్కరూ చేనేత దుస్తులు ధరించి ఉత్పత్తులను ప్రోత్సహించాలని స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య కోరారు. బుధవారం మండల కేంద్రంలోని చేనేత ఉత్పత్తుల కంపెనీని చేనేత, జౌళిశాఖ ఏడీ గోవిందయ్యతో కలిసి సందర్శించి కార్మికులు మగ్గాలపై తయారు చేస్తున్న జరి చీరలను పరిశీలించారు. అనంతరం పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల మార్ట్‌లో జరి చీరల డిజైన్లను చూసి ఆనందం వ్యక్తం చేశారు. కార్మికులు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లను తెలుసుకొని చీరలు తయారు చేస్తూ మార్కెట్‌కు పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఒకప్పుడు చాలీచాలని కూలితో చీరల తయారీకి దూరమైన కార్మికులు.. ప్రస్తుతం కంపెనీలో వాటాదారులుగా మారి ప్రతినెల వేతనం పొందుతున్నారని కంపెనీ సీఈఓ శేఖర్ వివరించారు. నేతన్నలను ఆదుకునేందుకు కంపెనీని ఏర్పాటు చేసి ప్రోత్సహించడం అభినందనీయమని శేఖర్‌ను అదనపు కలెక్టర్ అభినందించారు. అనంతరం చేనేత, జౌళిశాఖ ఏడీ గోవిందయ్య మాట్లాడుతూ.. అమరచింతలో తయారు చేసిన జరి చీరలను గద్వాల చీరలని గతంలో విక్రయించే వారని, అలాంటిది కంపెనీ ఏర్పాటు అనంతరం అమరచింత పేరు మీద ఆన్‌లైన్‌లో ఇతర రాష్ట్రాలు, దేశాల్లో సైతం విక్రయిస్తున్నారని చెప్పారు. కంపెనీ ప్రారంభించిన ఐదేళ్లలో 450 మంది పైచిలుకు కార్మికులు చేరి ఉపాధి పొందడమేకాకుండా కంపెనీలో భాగస్తులుగా ఉంటున్నారని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ నాగరాజు తదితరులు ఉన్నారు.