
కాంగ్రెస్ రౌడీయిజం మానుకోవాలి
వనపర్తి టౌన్: నియోజకవర్గంలో కాంగ్రెస్ దౌర్జన్యాలు పెరిగిపోయి నాయకులు రౌడీయిజం చెలాయిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ విమర్శించారు. ప్రధానమంత్రి మోదీ మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వివేకానంద మార్గ్‌లో దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆగడాలు వనపర్తిలో రోజురోజుకూ శృతిమించుతున్నాయని మండిపడ్డారు. చట్టాన్ని కాపాడే పోలీసులు కాంగ్రెస్‌పై ఒకలా, బీజేపీపై మరోలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విష సంస్కృతికి కాంగ్రెస్ పునాదులు వేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతుంటే మహిళలు అని కూడా చూడకుండా అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులను అక్రమ కేసులతో వేధించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. పోలీసులు, కాంగ్రెస్ వైఖరికి నిరసనగా మంగళవారం కేంద్ర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడంతో బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది రాజు, వారణాసి కల్పన, నాయకులు శ్రీనివాసులు, పద్మ, సూరి, శివారెడ్డి, రామ్‌రెడ్డి, సరోజ, రాము, తిరుమలేష్, కరీం, రాయన్న సాగర్ పాల్గొన్నారు.
నేడు పట్టణ బంద్‌కు బీజేపీ పిలుపు