
ముగిసిన ‘కళా ఉత్సవ్’
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని బాలభవన్‌లో రెండ్రోజులుగా కొనసాగిన జిల్లాస్థాయి కళా ఉత్సవ్ పోటీలు బుధవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి పోటీల కో–ఆర్డినేటర్, ఏఎంఓ మహానంది పాల్గొని మాట్లాడుతూ.. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నట్లు చెప్పారు. గాత్ర, వాద్య సంగీతం, శాసీ్త్రయ నృత్యం, జానపద బృంద నృత్యం, విజువల్ ఆర్డ్ 2డీ, 3డీ, దేశీయ బొమ్మల తయారీ, డ్రామా, కథ, కథనం తదితర అంశాల్లో విద్యార్థులు పోటీ పడ్డారని వివరించారు. మొదటి స్థానంలో నిలిచిన విజేతలు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని పేర్కొన్నారు. పోటీల జ్యూరీ కమిటీ సభ్యులు బైరోజు చంద్రశేఖర్, సుధాకరాచారి, ఎస్.సుజాత, బి.యాదగిరి, గోపాల్, ప్రసన్న, బాలవర్దన్, సరిత, షబానా, రాధిక, రమేష్ పాల్గొన్నారు.
‘బండి’ ఉత్సవాలను
జయప్రదం చేయండి
పాన్‌గల్: మండలంలోని రేమద్దులలో ఈ నెల 30న నిర్వహించే బండి యాదగిరి సాంస్కృతిక మండలస్థాయి ఉత్సవాలను జయప్రదం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు మధు, సీపీఎం రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్, పార్టీ జిల్లా నాయకుడు ఎండీ జబ్బార్ కోరారు. ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం గ్రామంలో నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. కళలతో ప్రజలను మేల్కొలిపి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొనేలా చేసిన గొప్ప కళాకారుడు బండి యాదగిరి అని కొనియాడారు. డప్పు, డోలు, మృదంగం, భజన, కోలాటం, బొడ్డెమ్మ, పల్లెసుద్దులు, జానపద కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు. ఐద్వా జిల్లాకార్యదర్శి వెంకటయ్య, భగత్, ఎం.వెంకటయ్య, భాస్కర్, చంద్రశేఖర్, మల్లేష్, ఎండీ ఖాజా, నిరంజన్, కృష్ణ య్య, భాస్కర్‌గౌడ్, కమలాకర్ పాల్గొన్నారు.
లేబర్ కోడ్లకు
వ్యతిరేకంగా పోరాడుదాం
అమరచింత: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌కోడ్లకు వ్యతిరేకంగా ప్రతి కార్మికుడు పోరాడాల్సిన అవసరం ఉందని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యం పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని మార్క్స్ భవనంలో జరిగిన టీయూసీఐ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ కనుసన్నల్లో పెట్టుబడిదారులు, సంపన్న వర్గాలను అందలం ఎక్కించే కార్యక్రమాలు చేస్తోందని ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను ఆమోదించాలని చూస్తోందన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న సుప్రీం తీర్పును నేటికీ అమలు చేయడం లేదని వివరించారు. రాజు, గణేష్, ప్రేమరత్నం, కురుమన్న, శ్రీను, చెన్నయ్య, ఏసేపు పాల్గొన్నారు.
రోడ్డెక్కిన అన్నదాతలు
గోపాల్‌పేట: యూరియా కోసం బుధవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట ఉన్న రహదారిపై బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలరాజు ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించగా ఓ రైతు మహిళ వేషధారణలో చీర కట్టుకొని యూరియా కావాలంటూ వ్యవసాయ అధికారులను కొంగు పట్టి అడుక్కున్నారు. మంగళవారం రాత్రి అయిపోయిందని.. మధ్యాహ్నం మూడు వరకు రెండు లారీలు వస్తుందని నచ్చ జెప్పడంతో శాంతించారు. ఒంటిగంట ప్రాంతంలో 450 సంచులు రాగా సిబ్బంది పంపిణీ చేశారు. రైతుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వనపర్తి, రేవల్లి పోలీసులు అక్కడకు చేరుకొని రాకపోకలను పునరుద్ధరించారు.