
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
వనపర్తి: జిల్లాలో కొలువుదీరిన గణనాథులను నిమజ్జనం చేసేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్ర, శనివారం జిల్లాకేంద్రంలోని నల్ల చెరువు, అమ్మ చెరువుల్లో వినాయక నిమజ్జనానికి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బుధవారం నల్లచెరువు పరిసరాలను ఆయన పరిశీలించారు. పట్టణం, మండలంలో 450 విగ్రహాలు ఉన్నాయని పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు. ఏర్పాట్లు, చెరువులో ప్రమాద స్థలలు ఎక్కడెక్కడ ఉన్నాయని మున్సిపాలిటీ డీఈ మహ్మద్ యూసఫ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. నిమజ్జనానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని.. సహాయక చర్యలు చేపట్టే వారికి కావాల్సిన సేఫ్టీ పరికరాలు సమకూర్చాలన్నారు. కలెక్టర్ వెంట ఏఈలు, మున్సిపల్ శానిటరీ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వర్‌రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.
5న గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలు
వనపర్తి: ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ పరిపాలన అధికారుల పోటీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సెప్టెంబర్ 5న నియామక పత్రాలను హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందజేయనున్నందున ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి సీసీఎల్‌ఏ ఉన్నతాధికారి లోకేష్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్‌తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని 15 మండలాలు 228 గ్రామపంచాయతీల్లో 133 క్లస్టర్ ఉండగా.. 135 మంది పరీక్షలు రాశారన్నారు. 109 మంది అర్హుల జాబితాను అధికారులు తయారు చేశారని.. ప్రస్తుతం 81 మందికి నియామక పత్రాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీరందరిని హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్, ఆర్డీఓ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి