
యూరియా తిప్పలు.. చెప్పుల బారులు
ఆత్మకూర్: మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ఉదయం నుంచి యూరియా కోసం చెప్పులు, పాస్‌పుస్తకాలను వరుస క్రమంలో పెట్టి పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు కాసారు. సాయంత్రం 5 గంటలకు ఒక లోడ్ 600 బ్యాగులు రావడంతో ఒక్కసారిగా రైతులు ఎగబడ్డారు. స్థానిక పోలీసులు కలుగజేసుకుని 215 మంది రైతులకు యూరియా పంపిణీ చేశారు. మిగిలిన 36 మంది రైతులకు టోకెన్లు అందించామని, మంగళవారం యూరియా అందిస్తామని ఏఓ వినయ్‌కుమార్, సీఈఓ నరేష్ తెలిపారు.
మధ్యాహ్నం 2 గంటలకు టోకెన్ల పంపిణీ
అమరచింత: పట్టణంలోని పీఏసీఎస్ కేంద్రాల వద్ద రైతులు సోమవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే క్యూలైన్‌లో చెప్పులు, రాళ్లు పెట్టి నిల్చున్నారు. కానీ మధ్యాహ్నం 2 గంటలకు యూరియా రాదని చెప్పిన అధికారులు లైన్లలో నిల్చున్న రైతులకు టోకెన్లు అందించి, మంగళవారం యూరియా తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నదాతలు పనులు వదులుకొని యూరియా కోసం ఇంకా ఎన్నాళ్లు తిరగాలని అధికారులను నిలదీశారు.
ఖిల్లాఘనపురం: సాగు చేసుకున్న పంటకు సకాలంలో యూరియా వేసేందుకు అన్నదాతలు అరిగోసపడుతున్నారు. నాలుగు రోజులైనా తనకు యూరియా ఇవ్వడం లేదని ఓ కౌలు రైతు ఏకంగా సింగిల్‌విండో కార్యాలయంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఘటన ఖిల్లాఘనపురంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయం వద్ద 15 రోజులుగా రెండు రోజులకు ఒకసారి యూరియా విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 7 గంటలకే వివిధ గ్రామాల నుంచి సుమారు 300 మంది రైతులు అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో ఖిల్లాఘనపురం గ్రామానికి చెందిన కౌలు రైతు బిక్కి చెన్నకేశవులు అక్కడికి వచ్చి యూరియా కోసం ఎదురు చూశాడు. అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న రైతులను చూసి ఇక తనకు యూరియా దొరకదని ఆందోళనకు గురై సింగిల్‌విండో కార్యాలయం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నిస్తుండగా ఎస్‌ఐ వెంకటేష్ అప్రమత్తమై తన సిబ్బంది రక్షించారు.

యూరియా తిప్పలు.. చెప్పుల బారులు