
ఏఐ నిఘా.!
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలపై నజర్
● అధునాతన సాంకేతికత
వినియోగిస్తున్న గృహనిర్మాణశాఖ
● అక్రమార్కులపై కలెక్టర్ కఠిన చర్యలు
● అనర్హులకు ఇళ్ల మంజూరు,
పాత నిర్మాణాలకు బిల్లులు చేసిన నలుగురిపై సస్పెన్షన్ వేటు
●
జిల్లాకు 6,004 ఇళ్లు
మంజూరు..
జిల్లావ్యాప్తంగా 6,004 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రజాపాలన దరఖాస్తుల పూర్తిస్థాయి పరిశీలన, ఇంటింటి సర్వే అనంతరం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. ఇందులో 3,285 ఇళ్లు గ్రౌండింగ్ కాగా.. 2,130 ఇళ్లు మార్కింగ్, 908 బేస్‌మెట్, 152 ఆర్‌సీ, 91 రూఫ్ లేవెల్‌లో ఉన్నాయి. రెండు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అత్యధికంగా జిల్లా కేంద్రంలోనే సుమారు 580 ఇళ్లు మంజూరు చేసినట్లు అధికారిక నివేదికల్లో పేర్కొన్నారు.
వనపర్తి: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు గృహనిర్మాణశాఖ అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఇటీవల ఏఐ టెక్నాలజీతో వనపర్తి మండలం అప్పాయిపల్లిలో పాత బేస్‌మెట్‌కు బిల్లు చేయించినట్లు గుర్తించి.. పంచాయతీ కార్యదర్శి, అసిస్టెంట్ ఇంజినీర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లాకు రెండు విడతల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఏఐ నిఘా పటిష్టంగా పనిచేస్తోందనేందుకు అధికారుల సస్పెన్షన్ ఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు. భవిష్యత్‌లో అన్ని ఇంజినీరింగ్ శాఖలకు ఏఐ టెక్నాలజీని అనుసంధానం చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ప్రత్యేకంగా తర్ఫీదు..
ఏఐ సాంకేతికతపై ఇటీవల పలువురు కలెక్టర్లకు కేంద్ర సర్వీసులశాఖ ముస్సోరిలో చాంపియన్ ఫర్ డిజిటల్ ఫార్మెషన్‌పై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సైతం వెళ్లిన విషయం విదితమే. అయితే ట్రైనింగ్‌కు వెళ్లకముందే.. ఏఐ సాంకేతికత ఆధారంగా ఇద్దరు అధికారులపై ఈ నెల 14న కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం.

ఏఐ నిఘా.!