
భూమిని వెనక్కి తీసుకుంటాం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం అధికారులు 500 గజాల భూమి కేటాయించడం, ట్రాన్స్‌కో అధికారులు కేటాయించిన దాని కంటే ఎక్కువ భూమిని చదును చేయడంతో వివాదం నెలకొంది. ఈ విషయమై ‘సాక్షిశ్రీలో మంగళవారం ‘పీయూలో సబ్‌స్టేషన్ వివాదం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై మంగళవారం ఉదయం విద్యార్థి సంఘాల నాయకులు పీయూ ముఖద్వారం వద్ద గంటసేపు నిరసన చేపట్టారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులు వెంటనే భూములను వెనక్కి తీసుకోవాలని, ట్రాన్స్‌కో అధికారులు కట్టిన ప్రహరీని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి విద్యార్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కేటాయించిన భూమి కంటే ఎక్కువ వినియోగించుకుంటే వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు వైస్ చాన్స్‌లర్ నుంచి స్పష్టమైన హామీ కావాలని పట్టుబట్టి అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట బైఠాయించారు. రిజిస్ట్రార్ రమేష్‌బాబు కూడా విద్యార్థి సంఘాల నాయకులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా వినిపించుకోలేదు. దీంతో వీసీ శ్రీనివాస్ బయటకు వచ్చి విద్యార్థులకు వివరణ ఇచ్చారు. కేటాయించిన భూమికంటే ఎక్కువ భూమిని వారు చదును చేశారని తెలిసిన వెంటనే నోటీసులు ఇచ్చామని, దీనికి వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఎక్కువగా వినియోగించిన భూమిని తిరిగి తీసుకుంటామని, కేటాయించిన భూమి వరకు హద్దులు నిర్ణయిస్తామని వీసీ పేర్కొన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సబ్‌స్టేషన్ దగ్గరకు వెళ్లి ఎక్కడి వరకు భూమి కేటాయించారు.. ఎక్కడి వరకు చదును చేశారు.. అని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, ఆయా సంఘాల నాయకులు కార్తిక్, రాము, గణేష్, తాయప్ప, రాజేష్, శ్రీను, ఆంజనేయులు, శివ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

భూమిని వెనక్కి తీసుకుంటాం