
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): వ్యవసాయ సీజన్ పూర్తయ్యే వరకు యూరియా సరఫరాపై కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేకంగా దృష్టిసారించి నిశితంగా పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో జిల్లాల వారీగా యూరియా లభ్యత, సరఫరా, ఇండెంట్ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎరువులు, యూరియా సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరిగినా.. దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా సదరు డీలర్లపై కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా పంపిణీ జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయని, వాస్తవంగా కేంద్రం నుంచి 9 లక్షల మె.ట., యూరియా రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 5.72 మె.ట., మాత్రమే వచ్చిందని ఇంకా సుమారు 3 లక్షల మె.ట., రావాల్సి ఉందన్నారు. కొన్ని ప్రైవేటు షాపులలో ఎక్కువ రేటుకు విక్రయిస్తూ ఇతర అనవసరమైన ఎరువులు అంటగడుతున్నారని, అలాంటి వాటిని సీజ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ సీజన్ ముగిసే వరకు ప్రతి ఎరువుల షాప్, పీఏసీఎస్, ఆగ్రో సేవా కేంద్రాలు, ఒక్కొక్క షాప్ వద్ద ఒక అధికారిని నియమించి పర్యవేక్షించేలా చూడాలన్నారు. నానో యూరి యా వాడకం– ప్రయోజనాల గురించి కూడా వ్యవసాయ అధికారులు రైతులకు వివరించాలని సూచించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు విజయేందిర, సిక్తాపట్నాయక్, బదావత్ సంతోష్, ఆదర్శ్ సురభి, బీఎం సంతోష్, ఆయా జిల్లాల ఎస్పీలు జానకి, ఎస్పీ యోగేష్ గౌతమ్, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, రావుల గిరిధర్, శ్రీనివాస్‌రావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అధిక ధరలకు అమ్మినా డీలర్‌పై కేసుల నమోదు
విక్రయాలపై కలెక్టర్లు, ఎస్పీలు నిశితంగా పర్యవేక్షించాలి
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం
మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం