
రోజువారీగా యూరియా వివరాలు ఇవ్వండి
● ప్రైవేటు డీలర్లతో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
● కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి: జిల్లాలో యూరియా విక్రయాలకు సంబంధించి రోజువారీగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం యూరియా విక్రయాలపై వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యూరియా విక్రయాల విషయంలో మండల వ్యవసాయశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎరువుల డీలర్ల వద్ద భారీగా యూరియా స్టాక్ ఉందని.. విక్రయాలను పర్యవేక్షించేందుకు ఒక ఏఈఓను కేటాయించాలని సూచించారు. ప్రైవేటు డీలర్లతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఎక్కడైనా డీలర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీఏసీఎస్‌ల్లో స్టాక్ అందుబాటులో లేకపోతే, స్టాక్ అధికంగా ఉన్న ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాల వివరాలతో కూడిన బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
● త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల జాబితా సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రదర్శించాలని.. జిల్లా స్థాయిలో 29న, మండల స్థాయిలో 30న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు స్వీకరించాలని తెలిపారు.
● జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని.. శ్యామ్, మ్యామ్ పిల్లల సంఖ్య జీరో ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మూడు నెలల్లో 25 మంది బాలికలకు వివాహాలు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని.. వాటిని ముందుగానే తెలుసుకొని నివారించి కొందరిపై కేసులు నమోదు చేయించినట్లు డీసీపీఓ రాంబాబు తెలిపారు. కాగా, వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలను ఎన్‌ఆర్‌సీ సెంటర్‌కు తీసుకెళ్లి వైద్యం చేయించడంతో పాటు పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
● ప్రభుత్వ ఆస్పత్రులకు ఏ విధమైన జ్వరం కేసు వచ్చినా డెంగీ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కలెక్టరేట్‌లో వైద్యారోగ్యశాఖ అధికారులతో డెంగీ సహా సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో యాంటీ లార్వా కార్యక్రమం చేపట్టాలన్నారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. అదే విధంగా గ్రామాల్లో టీబీ స్క్రీనింగ్ పెంచాలన్నారు. మిషన్ మధుమేహలో భాగంగా డయాబెటీస్ తేలిన వారికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ అప్‌డేట్ చేయాలన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
కొత్తకోట: రపభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కొత్తకోట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగీ, ఇతర సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యసిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు, ప్రోగ్రాం ఆఫీసర్ సాయినాథ్‌రెడ్డి ఉన్నారు.