
భూ సేకరణ త్వరగా పూర్తి చేయండి
వనపర్తి: జిల్లాలోని అత్యధిక ఆయకట్టుకు సాగునీరు అందించేలా మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెండింగ్ కాల్వ పనులు త్వరగా పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ప్రత్యేక ఉప కలెక్టర్ (భూ సేకరణ), ఇరిగేషన్, సర్వే అధికారులతో పెండింగ్ భూ సేకరణపై సమీక్ష నిర్వహించారు. కేఎల్‌ఐకు సంబంధించిన కాల్వలు, రిజర్వాయర్ల భూ సేకరణ పూర్తిచేసి ఇరిగేషన్‌శాఖకు అప్పగిస్తే పనులు త్వరగా పూర్తయి రైతులకు సాగునీరు అందుతుందన్నారు. గోపాల్‌పేట మండలం జయన్న తిర్మలాపూర్ ప్రాంతానికి చెందిన 12.95 ఎకరాల భూ సేకరణకు సర్వే పూర్తయినందున మార్కెట్ విలువ నిర్ధారించి అవార్డు పాస్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెప్టెంబర్ 15 వరకు ప్రాథమిక నోటీసు ప్రచురించేలా చూడాలని సూచించారు. రేవల్లి మండలం కేశంపేట పరిధిలోని 29.94 ఎకరాలకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయించాలన్నారు. రేమద్దుల పరిధిలోని డి–8 భూ సేకరణకు సంబంధించి ఇరిగేషన్ ఇంజినీర్లు పెగ్ మార్కింగ్ ఇవ్వాలన్నారు. దత్తాయిపల్లి, బుద్ధారం, షాపూర్, మల్కాపూర్ పరిధిలోని భూ సేకరణకు సంబంధించి ఎంజాయ్‌మెంట్ సర్వే చేస్తూ మిషన్ భగీరథ, ఉద్యానశాఖ అధికారులతో బోర్లు, వృక్షాల నివేదిక తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా బుద్ధారం పరిధిలోని 109.17 ఎకరాల్లో ఉన్న స్ట్రక్చర్ పేమెంట్ పూర్తిచేసి స్థలాన్ని ఇరిగేషన్‌శాఖకు అప్పగించాలన్నారు. ఖిల్లాఘనపురం మండలంలోని గణప సముద్రం ఎఫ్‌ఆర్‌ఎల్‌కు సంబంధించిన 197.09 ఎకరాల ఎంజాయ్‌మెంట్ సర్వే త్వరగా పూర్తి చేయాలని సర్వే అధికారిని ఆదేశించారు. కాం చెరువు, చందాపూర్, సవాయిగూడెం, పెద్దగూడెం గ్రామాలకు సంబంధించిన భూ సేకరణ నివేదిక అటవీశాఖకు సంబంధించిన పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సిందిగా సూచించారు. సమీక్షలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇరిగేషన్‌శాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్, ఈఈ కేశవరావు, ఏడీ మధుసూదన్, సర్వే ల్యాండ్ బాలకృష్ణ, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మధు, గోకుల్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి