
వీడని యూరియా కష్టాలు
ఆత్మకూర్/ఖిల్లాఘనపురం: యూరియా కోసం జిల్లా అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఆత్మకూర్ మండలంలోని వివిధ గ్రామాల రైతులు పట్టణంలోని పీఏసీఎస్ వద్దకు గురువారం తెల్లవారుజామున చేరుకొని చెప్పులను వరుసలో ఉంచి పడిగాపులు పడటం కనిపించింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 300 సంచులు రావడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి రైతులను వరుసలో నిల్చోబెట్టి సాయంత్రం వరకు పంపిణీ చేశారు. 248 మంది అందగా.. మిగిలిన 96 మందికి శుక్రవారం పంపిణీ చేస్తామని ఏఓ వినయ్‌కుమార్, సీఈఓ నరేష్ వివరించారు.
● ఖిల్లాఘనపురం మండలంలోని సింగిల్‌విండోకు 300 బస్తాలు, పట్టణంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణానికి 300 బస్తాల యూరియా బుధవారం వచ్చింది. గురువారం పంపిణీ చేస్తారని తెలియడంతో రైతులు ఉదయమే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. సిబ్బంది ఒక్కో రైతుకు రెండు చొప్పున పంపిణీ చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇప్పటి వరకు 37,600 బస్తాల యూరియా రైతులకు పంపిణీ చేశామని ఏఓ తెలిపారు.

వీడని యూరియా కష్టాలు