
గురుకుల విద్యార్థులకు అస్వస్థత
కొత్తకోట రూరల్/కొత్తకోట: పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఒకేసారి చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యసిబ్బంది అక్కడికి చేరుకొని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చాలామంది అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు వంటి లక్షణాలకు గురయ్యారని తెలిపారు. తమ పిల్లలను ఇంటికి పంపించాలని కోరినా వదలడం లేదని.. జ్వరంతో బాధపడుతూ ఇక్కడే ఉండాలంటూ ప్రిన్సిపాల్ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బీఆర్‌ఎస్ నాయకులు, స్థానిక విద్యార్థి సంఘాల నాయకులు వసతి గృహం ఎదుట బైఠాయించి ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు వచ్చి విద్యార్థినుల ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. వైద్యులు పరీక్షించి అవసరమైన మందులు ఇచ్చారని సమాధానమిచ్చారు. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా కుటుంబ సభ్యుల వెంట పంపాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. వసతి గృహం చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని కోరారు. నిరసన కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, సీడీసీ మాజీ చైర్మన్ బీసం చెన్నకేశవరెడ్డి, గాడీల ప్రశాంత్, అయ్యన్న, మాజీ కౌన్సిలర్ చీర్ల నాగన్న, కె.శ్రీనివాస్‌జీ, కిరణ్, ఏసు, యుగంధర్‌రెడ్డి, బుచ్చన్న పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ సందర్శన..
కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. శ్రీనివాసులు గురువారం సాయంత్రం గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, ఆహారం అందించడాన్ని పరిశీలించారు. వైద్య పరీక్షల్లో ఇద్దరికి టైఫాయిడ్ నిర్ధారణ కాగా.. చికిత్స అనంతరం తిరిగి తరగతులకు పంపించినట్టు డీఎంహెచ్‌ఓ వివరించారు. 22 మంది విద్యార్థులు వైరల్ జ్వరాలతో బాధపడుతుండగా.. చికిత్స అందించామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడే వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని.. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
సీపీఎస్ రద్దే లక్ష్యం :
ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
కొత్తకోట: కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దే లక్ష్యంగా పీఆర్టీయూ పని చేస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్లను గురువారం పట్టణంలో సంఘం ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. ధర్నాకు ఉపాధ్యాయులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. పులగం దామోదర్‌రెడ్డి, గుండు లక్ష్మణ్, పేరి వెంకట్‌రెడ్డి, సూర చంద్రశేఖర్, భక్తరాజు, సత్యనారాయణ, ఎస్.గోపాల్, ఎస్.బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
‘ప్రజా ఉద్యమాల్లో
భాగస్వాములు కావాలి’
పాన్‌గల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, స్థానిక సమస్యల పరిష్కారానికి సీపీఎం నిర్వహించే ఉద్యమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ పిలుపునిచ్చారు. బషీర్‌బాగ్ విద్యుత్ పోరాట అమరుల దినోత్సవంలో భాగంగా గురువారం మండలంలోని రేమద్దులలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి సంస్మరణ సభలో మాట్లాడారు. నాడు జరిగిన విద్యుత్ ఉద్యమంలో ముగ్గురు పోలీసుల కాల్పుల్లో మరణించారని.. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకపోయాయని తెలిపారు.

గురుకుల విద్యార్థులకు అస్వస్థత

గురుకుల విద్యార్థులకు అస్వస్థత