
అడిగిన సమాచారం ఇవ్వడం బాధ్యత
వనపర్తి: సమాచార హక్కు చట్టం–2005 ప్రకారం ప్రజలు కోరిన సమాచారం నిర్ణీత గడువులోగా అందించడం అధికారుల బాధ్యతని స.హ. చట్టం కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యారెడ్డి, వైష్ణవి మెర్ల అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో పీఐఓలకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం, పారదర్శక పాలన అందించడమే సమాచార హక్కు చట్టం (స.హ. చట్టం) ముఖ్య ఉద్దేశమన్నారు. పీఐఓలు, ప్రభుత్వ అధికారులు చాలామంది సమాచారం ఇచ్చేందుకు అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందని.. విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పీఐఓ (పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్)లు, అప్పీలేటు అధికారులు చట్టాన్ని పూర్తిగా చదివి ఆకలింపు చేసుకుంటేనే అర్జీదారులు కోరిన సమాచారం ఎలా ఇవ్వాలి.. తమ దగ్గర లేని సమాచారం ఇతర శాఖల అధికారులకు ఎలా పంపించాలనే విషయంపై అవగాహన వస్తుందని చెప్పారు. ప్రభుత్వ అధికారిక సమాచారం ఏది కోరినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రపంచంలో ఆర్టీఐ చట్టం సుమారు 130 దేశాల్లో అమలవుతుండగా.. అత్యంత పకడ్బందీగా అమలు చేస్తున్న దేశాల్లో భారత్ ఎనిమిదో స్థానంలో ఉందని చెప్పారు. అధికారులకు చట్టంపై అవగాహన లేకపోవడంతోనే అప్పీలేటు అధికారి, కమిషనరేట్ వరకు అర్జీలు వస్తున్నాయని.. పీఐఓలు ఎప్పటికప్పుడు స్పందించి 30 రోజుల గడువులోగా అర్జీదారుకు సమాచారం ఇవ్వాలని, పౌరుల చేతిలో ఈ చట్టం ఓ ఆయుధంగా పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని అధికారులు చట్టంపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉంటేనే అర్జీలు ప్రాథమిక దశలోనే పరిష్కారమవుతాయన్నారు. రెండేళ్లుగా కమిషనర్ల నియామకం లేకపోవడంతో పేరుకుపోయిన అర్జీలను పరిష్కరించేందుకు జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించినట్లు వివరించారు. పీఐఓలు అడిగిన సందేహాలను వారు నివృత్తి చేశారు. ప్రతి కార్యాలయంలో స.హ. చట్టం బోర్డు, అందులో పీఐఓ, ఏపీఐఓ వివరాలు, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల బాధ్యతను తెలియజేసే 4(1)(బి) తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. జిల్లాలో 83 అప్పీళ్లు పెండింగ్‌లో ఉండగా.. అందరిని పిలిపించి సంబంధిత శాఖల అధికారులతో సమాచారం ఇప్పించారు. ఇంకా సంతృప్తి చెందని అర్జీదారులకు కోరిన విధంగా 15 రోజుల్లోగా పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. అర్జీదారులకు ఈ విచారణ సంతృప్తినివ్వలేదనే మాటలు వినిపించాయి.
అఫిడవిట్ దాఖలు రాకపోవటం శోచనీయం..
విచారణ సమయంలో అందజేయాల్సిన అఫిడవిట్లు సైతం పీఐఓలకు రాయడం రాకపోవడం ఏమిటని కమిషనర్లు విస్మయం వ్యక్తం చేశారు. తమవెంట వచ్చిన సీసీలతో ఎలా రాయాలంటూ గుసగుసలాడుకోవడం పరిశీలించామన్నారు. చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉంటే అఫిడవిట్లతో పాటు పౌరులు కోరిన ప్రతి అర్జీకి సమాచారం నిర్ణీత సమయంలో ఇచ్చేస్తారని తెలిపారు.
18 వేల అప్పీళ్లు పెండింగ్...
రాష్ట్రంలో సమాచార హక్కు చట్టానికి మూడున్నర ఏళ్లుగా కమిషనర్ల నియామకం లేకపోవడంతో 18 వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉండగా.. జిల్లాల పర్యటనలు చేపడుతూ ఇప్పటి వరకు 3,500 పరిష్కరించినట్లు తెలిపారు. విచారణలో విభిన్న అంశాలు వెలుగుచూస్తున్నాయని వారు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా సమాచారం కోరుతూ కొందరు.. అధికారులను ఇరకాటంలో పెట్టేందుకు మరికొందరు అర్జీలు దాఖలు చేసినట్లు గుర్తిస్తున్నామని చెప్పారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు సమాచారం ఇవ్వని కేసులు సైతం మా దృష్టికి వచ్చాయన్నారు. పారదర్శకంగా చట్టాన్ని అమలు చేయాలని సూచించారు.