
అన్నదాత.. ఆందోళన
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
ఆత్మకూర్: యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. వర్షంలోనూ తెల్లవార్లు పడిగాపులు పడుతూ చెప్పులతో క్యూలైన్లు ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. చేసేది లేక చివరకు మంగళవారం రోడ్డెక్కి రాస్తారోకో చేపట్టారు.
● మండలంలోని వివిధ గ్రామాల రైతులు స్థానిక బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. తమకు యూరియా సరఫరా చేసే వరకు ఇక్కడి నుంచి కదలమని భీష్మించుకు కూర్చున్నారు. పీఏసీఎస్ కార్యాలయానికి ఐదురోజులుగా తిరుగుతున్నా.. కొంతమందికి ఇచ్చి చేతులెత్తేస్తున్నారని రైతులు మండిపడ్డారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు మనోహర్‌గౌడ్, పార్టీ మండల అద్యక్షుడు అశోక్‌భూపాల్, ప్రధానకార్యదర్శి సాయికుమార్ మాట్లాడుతూ.. రైతులకు సరిపడా యూరియా అందించకపోతే తిరగబడతామని హెచ్చరించారు. ఒకానొక సమయంలో రైతులు, నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎస్‌ఐ నరేందర్ ఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. పీఏసీఎస్ అధికారులను పిలిపించి సరిపడా యూరియా అందుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పించడంతో శాంతించారు. కార్యక్రమంలో రైతులు మల్లేష్, రాము, వెంకటన్న, చంద్రయ్య, పార్వతమ్మ, రాజు, వెంకటన్న, నర్సింహులు పాల్గొన్నారు.
అపోహలతోనే ఇబ్బందులు..
రోజుకు 25 టన్నుల చొప్పున యూరియా పీఏసీఎస్‌కు వస్తుంది. రెండోవిడత దొరుకుతుందో లేదోనని తీసుకున్న రైతులే మళ్లీ తీసుకుంటున్నారు. పీఏసీఎస్‌తో పాటు రైతు ఆగ్రో సేవాకేంద్రం, హాకా కేంద్రాల వద్ద యూరియా అందుబాటులో ఉంది. అలాగే రేచింతల, ఆరేపల్లి, వీరరాఘవపూర్‌లో కావాల్సినంత యూరియా ఇస్తున్నారు. రైతులు ఆందోళనలకు గురికాకుండా అపోహలను నమ్మకుండా తమకు కావాల్సిన మేర యూరియా మాత్రమే తీసుకెళ్లాలి. – నరేష్, సీఈఓ, సింగల్‌విండో
వర్షంలోనూ తెల్లవార్లు పడిగాపులు
ఆత్మకూర్ పీఏసీఎస్ వద్ద చెప్పుల వరుస
అధికంగా తీసుకోవడంతోనే ఇబ్బందులు అంటున్న అధికారులు

అన్నదాత.. ఆందోళన