● అర్హులందరికీ ప్రభుత్వ పథకాల
ప్రయోజనం అందాలి
● దిశ సమావేశంలో ఎంపీ తనూజా రాణి
పార్వతీపురం: గిరిజన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణి సూచించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దిశ (జిల్లాస్థాయి అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) సమావేశంలో ఎంపీ తనూజారాణి, కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలితో కలిసి వివిధ శాఖల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ మౌలిక వసతులు, ఉపాధి హామీ పనులు, తాగునీరు, రహదారుల నిర్మాణాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. సమీక్షా సమావేశాలలో లక్ష్యాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. దిశ సమావేశం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించే వేదికగా ఉండాలని, వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలు, అవసరమైన మార్పులు, మెరుగైన సూచనలను అధికారుల సమక్షంలో చర్చించాలని సూచించారు. పార్లమెంట్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిని కూడా ఎంపీ సమీక్షించారు. రద్దయిన లేదా పెండింగ్‌లో ఉన్న పనులకు సంబంధించిన నిధులను ఇతర అవసరమైన పనులకు కేటాయించే అవకాశాలను పరిశీలించి నివేదికలను అందించాలని కోరారు. జిల్లాలో అభివృద్ధి పనులను ఎక్కడా నిలిపివేయకుండా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
15 రోజులకోసారి పనుల పురోగతిపై సమీక్ష
కలెక్టర్ మాట్లాడుతూ నీటిపారుదల, పైప్‌లైన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, స్థల సమస్యలను ముందుగానే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు పనుల పురోగతిని సమీక్షిస్తానని తెలిపారు. ‘మా ఊరు మలేరియా రహితం’ కార్యక్రమంలో లార్వా నివారణ చర్యలను వేగవంతం చేయాలని, అవసరమైతే ఏఐ సాంకేతికతను వినియోగించే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాలలో పాఠశాలలకు మౌలిక వసతుల కల్పన, కొత్తగా గుర్తించిన జలపాతాలు, హోమ్ స్టేల అభివృద్ధిపై సమావేశంలో చర్చించారు. పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకాలతో పాటు వ్యవసాయం, పశుసంవర్థక, ఉపాధిహామీ, గృహనిర్మాణం, మహిళా సంక్షేమ పథకాల పురోగతిని కూడా సమీక్షించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


