చోరీ సొత్తుతో పట్టుబడిన తల్లీకూతుళ్లు | - | Sakshi
Sakshi News home page

చోరీ సొత్తుతో పట్టుబడిన తల్లీకూతుళ్లు

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

చోరీ సొత్తుతో పట్టుబడిన తల్లీకూతుళ్లు

● నిందితుల అరెస్టు, బంగారం, వెండి స్వాధీనం

లక్కవరపుకోట: చోరీ చేసిన సొత్తును కొత్తవలస మండల కేంద్రంలో గల ఒక బంగారం షాపులో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న తల్లీ కూతుళ్లను ఎల్‌.కోట ఎస్సై జె.రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని భీమాళి గ్రామంలో ఈ నెల 19వ తేదీన నత్తల రవి ఇంట్లో దొంగలు చొరబడి బీరువాను పగలకొట్టి కొంత బంగారం, వెండి వస్తువులతో పాటు రూ.20వేలు నగదు దోచుకుపోయారు. ఈ మేరకు పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేసి చాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.సీసీ ఫుటేజ్‌ల పరిశీలనతో పాటు అనుమానం ఉన్నవారిపై నిఘా ఏర్పాటు చేశారు. కాగా ఆదే గ్రామానికి చెందిన గొటివాడ లక్ష్మి (42) ఆమె కుమార్తె (17) (మైనర్‌) కలిసి కొత్తవలస జంక్షన్‌ సమీపంలో ఒక బంగారు షాపు వద్ద అనుమానంగా తిరుగుతుండగా పోలీసులు వారిని పట్టుకుని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద 30.270 గ్రాముల బంగారం, 16.720 వెండి ఆభరణాలను గుర్తించారు. పోలీసులు తనదైన శైలిలో మరింతగా ప్రశ్నించగా భీమాళి గ్రామంలో దొంగతనం చేసింది తామేనని ఒప్పకున్నారు. దీంతో వారి నుంచి బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని ఆరెస్టు చేసి కొత్తవలస న్యాయస్థానంలో హాజరుపర్చినట్లు ఎస్సై తెలిపారు. కాగా బాలిక జల్సాలకు అలవాటు పడడంతో ఖర్చులకు డబ్బులు లేక ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని ఎస్సై చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement