రాజాం సిటీ: స్వచ్ఛత మున్సిపాలిటీల కేటగిరీలో రాజాం మున్సిపాలిటీ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని కమిషనర్ ఎ.రామచంద్రారావు బుధవారం తెలిపారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో 50వేల లోపు జనాభా కలిగిన మున్సిపాల్టీల విభాగంలో స్వచ్ఛమున్సిపాల్టీగా ప్రథమ స్థానం దక్కిందన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఘనవ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణతో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యం, మరుగుదొడ్లు నిర్వహణ, పచ్చదనం పెంపొందించడం వంటి పనులకు అవార్డు వచ్చిందన్నారు. ఇది ఉద్యోగులు, ప్రజల సమష్టికృషికి వచ్చిన అవార్డుగా పేర్కొన్నారు.
రబీ సాగుకు ప్రణాళికలు సిద్ధం చేయండి
విజయనగరం ఫోర్ట్: రబీలో 91,021 హెక్టార్లలో పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌లో సాగుకాని భూముల్లో పంటల సాగుతో పాటు రబీలో అధిక విస్తీర్ణంలో పంటల సాగయ్యేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ నెల 29నాటికి ఖరీఫ్ సాగు విస్తీర్ణం 1,15,580 హెక్టార్లకు చేరిందన్నారు. వరి కోతల అనంతరం పొలాల్లో తేమ ఉన్నప్పుడే ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా రైతులను చైతన్యపరచాలన్నారు.
సోలార్ లక్ష్యాలు పూర్తి చేయాలి
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున మొత్తం 15 వేల సోలార్ విద్యుత్ యూనిట్ల స్థాపన లక్ష్యాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఏపీఈపీడీసీఎల్ అధికారులు, కాంట్రాక్టర్లకు బుధవారం సూచించారు. ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులకు మొదటి విడతలో 15వేల అగ్రిమెంట్లకు గాను 8,089 యూనిట్లు అమర్చినట్టు ఎస్‌ఈ లక్ష్మణరావు తెలిపారు.
● జిల్లాలో కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి బుధవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతులు మరియు ప్రోత్సాహక కమిటీ వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెలలో అందిన 43 దరఖాస్తుల్లో 27 ఇప్పటికే పరిష్కరించామని చెప్పారు.
గంజాయి, డ్రగ్స్‌తో ఆరోగ్యం చిత్తు


