● విజయనగరంలో విధుల బహిష్కరణ ● జిల్లా కోర్టు ప్రధాన గేటు వద్ద ఆందోళన
విజయనగరం లీగల్: విజయవాడలో న్యాయవాదులపై పోలీసుల దాడి ఘటనకు నిరసనగా విజయనగరంలో న్యాయవాదులు తమ విధులను బుధవారం బహిష్కరించారు. కోర్టు ప్రధాన గేటు వద్ద ఆందోళన చేశారు. పోలీసుల చర్యలను ఖండించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బెల్లాన రవి మాట్లాడుతూ న్యాయవాదులపై దాడికి పాల్పడిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న న్యాయవాదులపై పోలీసులు కర్కశంగా లాఠీలు ఝుళిపించడంపై నిరసన తెలిపారు. న్యాయవాదుల రక్షణ చట్టం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. దాడికి నిరసనగా బుధవారం, గురువారం తమ విధులు బహిష్కరించాలని ఏకగ్రీవం తీర్మానం చేసినట్లు తెలిపారు. నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరూ పాల్గొని ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ ఉపాధ్యక్షుడు పి.బ్రాహ్మజీ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


