విజయనగరం గంటస్తంభం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. బుధవారం రాత్రి జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ రాంసుదర్‌రెడ్డి మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లలో 24 గంటల పాటు సిబ్బంది విధులు నిర్వహించాలని, ప్రజలు తెలియజేసిన సమస్యలను ఉన్నతాధికారులకు పంపించాలన్నారు. లోతట్టు, ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి ప్రవాహలకు ఉన్న అడ్డంకులు తొలగించి నీరు సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు పడిపోయిన చెట్లను తొలగించాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు.
నారాయణపురం ఆనకట్టకు పోటెత్తిన వరద నీరు
సంతకవిటి: మండలంలోని రంగారాయపురం వద్దనున్న నారాయణపురం ఆనకట్టకు వరద నీరు పోటెత్తుతోందని డీఈ వై. రవీంద్రనాయు డు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇన్ ఫ్లో పెరగడంతో షట్టర్ల నుంచి వరదనీరు విడిచిపెడుతున్నట్లు చెప్పారు.
అగ్ని ప్రమాదాలపై అవగాహన
విజయనగరం టౌన్: జిల్లా కేంద్రంలోని వివిధ సంస్థల్లో అగ్నిమాపక సిబ్బంది బుధవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హోటల్స్, హాస్పిటల్స్, షాపులు, తదితర ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి.. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏడీఎఫ్‌ఓ వి.సోమేశ్వరరావు, లీడింగ్ ఫైర్‌మెన్ నాగరాజు, సత్యారావు, గౌరీ, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్: ఎస్.కోట పోలీస్‌స్టేషన్ పరిధిలో 2020 ఫిబ్రవరిలో నమోదైన గంజాయి కేసులో అరెస్టయిన ముగ్గురు ముద్దాయిలకు ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ. 10 వేలు చొప్పున జరిమాన విధిస్తూ విజయనగరం ఫస్ట్‌క్లాస్ ఏడీజే కమ్ స్పెషల్ జడ్జి కె.విజయకల్యాణి బుధవారం తీర్పు చెప్పారని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఆయన తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం కంచుమర్రు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (ఏ1) హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ, గంజాయికి అలవాటు పడ్డాడు. అరకులో గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చి ఇదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ వంతల సీతారాం (ఏ2), వంతల జీనబంధు (ఏ3)లను సంప్రదించి, వారి వద్ద మూడు కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. ఈక్రమంలో గంజాయిని హైదరాబాద్ తీసుకెళ్తూ ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఎస్సై కె.నీలకంఠం, పోలీస్ సిబ్బందికి నిందితులు పట్టుబడ్డారు. దీంతో అప్పటి ఎస్.కోట సీఐ బి. శ్రీనివాసరావు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో ముద్దాయిలకు జైలు శిక్షతో పాటు జరిమాన విధించారు. ఏపీపీ కేఈ స్వర్ణలత భాను పోలీసుల తరఫున వాదనలు వినిపించారు.
కారును ఢీ కొట్టిన ఆటో
పూసపాటిరేగ: భోగాపురం మండలం మహారాజుపేట సమీపంలో కారు నిర్లక్ష్యంగా ఆపడంతో వెనుక వస్తున్న ఆటో కారును ఢీ కొట్టింది. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. భీమునిపట్నం మండలం రేఖవానిపాలెంనకు చెందిన మల్లేటి దుర్గాభవాని హైదరాబాద్ వెళ్లేందుకు భోగాపురం ఏఎస్‌ఆర్ ఎయిర్‌పోర్టుకు ఆటోలో బయలు దేరారు. మహారాజుపేట సమీపంలో ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా కారు సడన్‌గా బ్రేక్ వేయడంతో.. ఆటో వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు దుర్గాభవానీకి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భోగాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


