మాకు నచ్చలేదు.. ఎన్నిక రద్దు చేయండి.. | - | Sakshi
Sakshi News home page

మాకు నచ్చలేదు.. ఎన్నిక రద్దు చేయండి..

Sep 30 2026 1:58 AM | Updated on Sep 30 2026 1:58 AM

చీపురుపల్లి: చీపురుపల్లి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎంపీ ఎన్నిక మంగళవారం సజావుగా జరిగిపోయింది. పాఠశాలలో 19 మంది డైరెక్టర్లను విద్యార్థులు తల్లిదండ్రులు స్వయంగా ఎన్నుకున్నారు. అంతా బాగుంది అనుకున్న సమయంలో కూటమి పార్టీ మద్దతుదారులకు విద్యార్థులు తల్లిదండ్రులు నుంచి మద్దతు లభించకపోవడంతో మధ్యాహ్నం జరగాల్సిన ఎస్‌ఎంసీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను అడ్డుకున్నారు. తాము అధికారంలో ఉండగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఎలా గెలుస్తారనే అక్కసుతో ఎన్నికల అధికారులపై వేధింపులకు దిగారు. తల్లిదండ్రులకు అవగాహన లేదు.. మాకు నచ్చలేదు.. మీకు నచ్చినట్లు ఎన్నిక జరిపించారు.. అందుకనే ఎన్నిక జరగనట్టుగా చూపించి వాయిదా వేసేయండి అంటూ హెచ్‌ఎం ఉమామహేశ్వరిపై ఒత్తిడి తీసుకొచ్చారు. నిబంధనల ప్రకారమే ఎన్నిక జరిగిందని హెచ్‌ఎం వివరించినా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కళావెంకటరావుతో ఫోన్‌ చేయించి ఒత్తిడి పెంచడంతో ఎస్‌ఎంసీ ఎన్నిక హైడ్రామా రాత్రి 8 గంటల వరకు నడిచింది.

ఇదీ కారణం..

తల్లిదండ్రులు ఎన్నుకున్న 19 మంది డైరెక్టర్లలో 13 మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారులని, చైర్మన్‌, వైఎస్‌చైర్మన్‌ పదవులు ఆ పార్టీ మద్దతుదారులకే వెళ్తాయంటూ కూటమి నేతలు రాద్ధాంతానికి దిగారు. ఎన్నిక రద్దుచేయాలని ఒత్తిడి పెంచారు. నిబంధనల ప్రకారం జరిగిన ఎన్నిక ఎలా రద్దుచేస్తాంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గ యువజన విభా గం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ అధికారులను నిలదీశారు. వైఎస్సార్‌సిపి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్‌ బెల్లాన చంద్రశేఖర్‌ కూడా పాఠశాలకు చేరుకుని చైర్మన్‌, వైఎస్‌ చైర్మన్‌ ఎన్నిక ఎందుకు నిర్వహించడంలేదంటూ హెచ్‌ఎంను ప్రశ్నించారు. 19 మంది డైరెక్టర్లను ఎన్నుకున్న నేపథ్యంలో వారి పేర్లుతో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో రాత్రి 8 గంటలు సమయంలో హెచ్‌ఎం ఉమామహేశ్వరి 19 డైరెక్టర్లు ఎన్నిక జరిగిందని లిఖిత పూర్వకంగా రాసి సభ్యులకు అందజేశారు. శాంతిభద్రతల నేపథ్యంలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా వేసినట్టు హెచ్‌ఎం ప్రకటించారు.

ఎన్నికను రద్దు చేయాలంటూ పాఠశాల హెచ్‌ఎం చుట్టూ కూర్చుని ఒత్తిడి చేస్తున్న కూటమి నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement