విజయనగరం ఫోర్ట్:
అందరికీ అన్నం పెట్టే రైతన్న ఏటా ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో పంటలు దెబ్బతిని నష్టపోతున్నాడు. ఆపద కాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు. 2025 అక్టోబర్ నెలలో సంభవించిన మోంఽథా తుఫాన్ వల్ల జిల్లాలో వరి, మొక్కజొన్న, చెరకు, ఉలవ, పత్తి, శనగ, మినుము, తదితర 776.978 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. దీనికి పరిహారంగా రూ.1.93 కోట్ల ఇన్‌పుడ్ సబ్సిడీ రైతులకు చెల్లించాలని వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇంతవరకు ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు. గత ఐదు రోజుల కిందట కురిసిన తుఫాన్ వర్షాలకు 189.83 హెక్టార్లలో అరటి, బొప్పాయి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. అరటి 129.11 హెక్టార్లు, బొప్పాయి 57.72 హెక్టార్లు, కూరగాయలకు 3 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్టు ఉద్యానశాఖ అధికారులు గుర్తించారు. సుమారు 5.69 కోట్లు వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. బొబ్బిలి, చీపురుపల్లి, డెంకాడ, గంట్యాడ, గరివిడి, మెరకముడిదాం, నెల్లిమర్ల, పూసపాటిరేగ, రామభద్రపురం, రేగిడి ఆమదాలవలస, ఎస్.కోట, తెర్లాం, వంగర మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు నమోదుచేశారు. అధికారులు గుర్తించినా పరిహారం అందుతుందో లేదోనన్న బెంగ రైతులను వెంటాడుతోంది. చంద్రబాబు ప్రభుత్వంపై రైతులకు నమ్మకం పోయింది. మరోవైపు ఆదుకోవాలంటూ వరి పంట నష్టపోయిన నదీ తీర గ్రామాల రైతులు కన్నీరు పెడుతున్నారు. ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో పరిహారం అందజేయాలని కోరుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా పథకం అమలుతో పాటు పంట నష్టపరిహారం రైతుల ఖాతాలకు సకాలంలో జమయ్యేదని, ఇప్పుడు రైతులను ఆదుకునే పరిస్థితి లేదని చెబుతున్నారు.
పరిహారం విడుదల కాలేదు..
2025 అక్టోబర్‌లో సంభవించిన మోంథా తుఫాన్ వల్ల పంటలు నష్టపోయిన రైతులకు రూ.1.93 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు ఆ నిధులు విడుదల కాలేదు.
– ఎం.రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి
రైతులను వెంటాడుతున్న విపత్తులు
పట్టించుకోని చంద్రబాబు సర్కారు
మోంథా తుఫాన్ నష్టపరిహారం రూ.1.93 కోట్లు విడుదలకాని వైనం
ఇటీవల కురిసిన తుఫాన్ వర్షాలకు 189 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం
రూ.5.69 కోట్ల వరకు నష్టం
వాటిల్లినట్టు అంచనా
ఆవేదనలో రైతాంగం


