పార్వతీపురం రూరల్: ఆరుగాలం శ్రమించి జగతికి అన్నంపెట్టే కర్షకుడు కన్నీరుపెడితే కంచంలోకి కూడు రాదని.. రైతు బతికితేనే ప్రజలకు కడుపునిండా తిండి దొరుకుతుందని జంఝావతి సాధన సమితి రైతులు స్పష్టంచేశారు. జంఝావతి ప్రాజెక్ట్‌ను పూర్తిస్థాయిలో సాధించుకునేందుకు పార్వతీపురం కలెక్టరేట్ వద్ద చేపట్టిన దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మరిశర్ల మాలతీ కృష్ణమూర్తినాయుడు ఆధ్వర్యంలో సాధన సమితి అధ్యక్షుడు చుక్క భాస్కరరావు నేతృత్వంలో సాగుతున్న ఈ దీక్షల్లో బాలగుడబ, వెంకటరాయుడిపేట, తదితర గ్రామాల అన్నదాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాలుగా జంఝావతి ప్రాజెక్ట్ కేవలం ఎన్నికల వాగ్దానాలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తంచేశారు. సాగునీరు అందక రైతులు వ్యవసాయాన్ని వీడి వలసబాట పడుతున్నారని వాపోయారు. వెంటనే పాలకులు స్పందించి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జట్టు వ్యవస్థాపకుడు డాక్టర్ డొల్లు పారినాయుడు, న్యాయవాదులు తిరుపతిరావు పట్నాయక్, పూసర్ల సురేశ్ కుమార్, తదితరులు నిరసన శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు వంగల దాలినాయుడు, పల్లి రాజు, పాలక రంజిత్, సంబంగి రమేష్, తెర్లి సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.
జంఝావతి సాధన సమితి సభ్యులు


